గురువారం 26 నవంబర్ 2020
International - Nov 04, 2020 , 01:59:46

ఇద్దరు నేతలూ భారత్‌కు మద్దతుదారులే

ఇద్దరు నేతలూ భారత్‌కు మద్దతుదారులే

  • అధ్యక్ష పీఠంపై ట్రంప్‌, బిడెన్‌లో ఎవరున్నా స్నేహమే 

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలనగానే ప్రపంచంలోని ప్రతి దేశం లాభనష్టాల బేరీజు వేసుకోవటం పరిపాటి. అగ్రరాజ్యం అధినేతగా ఎవరు ఎన్నికైతే లాభం, ఎవరితో నష్టం అనే లెక్కలు చాలా దేశాలు వేసుకుంటుంటాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో కూడా అలాంటి లెక్కలు, విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌, బిడెన్‌ ఇద్దరూ భారత్‌ మంచి మిత్రులనే పేరు ఉన్నది. ట్రంప్‌ నాలుగేండ్ల పాలనలో వాణిజ్యపరంగా భారత్‌కు పెద్దగా ప్రయోజనాలు కలుగకపోయినప్పటికీ మన ప్రధాని మోదీకి మంచి మిత్రుడిగా ఉన్నారు. ఒబామా పాలనలో ఎనిమిదేండ్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బిడెన్‌, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగేందుకు కృషి చేశారు. వ్యూహాత్మకంగా  భారత్‌తో అమెరికా స్నేహం చేయటానికే మొగ్గుచూపుందని నిపుణులు అంటున్నారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా పెత్తనాన్ని అడ్డుకోవటానికి అమెరికాకు భారత్‌ సాయం తప్పనిసరని పేర్కొంటున్నారు. 

ట్రంప్‌ మిత్రుడే కానీ..

భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలాసార్లు ప్రకటించారు. వీరిద్దరు గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌లో హౌడీ మోదీ కార్యక్రమంతోపాటు ఈ ఏడాది మొదట్లో భారత్‌లోని గుజరాత్‌లో భారీ సభల్లో కలిసి పాల్గొన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ట్రంప్‌ మద్దతు ప్రకటించారు. అయితే, వాణిజ్య సంబంధాల్లో మాత్రం అంత స్నేహం చూపించలేదనే అభిప్రాయం ఉన్నది. ట్రంప్‌ నాలుగేండ్ల పాలనలో భారత్‌తో తప్ప అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనాను తీవ్రంగా ద్వేషించినప్పటికీ ఆ దేశంతో భారీ ఒప్పందం చేసుకున్నారు. భారత్‌తో మాత్రం అలా చేయలేదు. బిడెన్‌ కూడా కొన్ని విషయాల్లో అలాగే వ్యవహరించారనే విమర్శలున్నాయి. మనదేశంతో అమెరికా అణు ఒప్పందం చేసుకోవటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధికి కృషి చేశారు. కానీ ఆయన ‘అమెరికాకే ఎక్కువ ప్రయోజనం’ అనే విధానాన్ని అవలంభించారనే విమర్శలు ఉన్నాయి. 

విస్మరించే పరిస్థితి లేదు

భౌగోళిక ప్రాధాన్యం దృష్ట్యా భారత్‌ను విస్మరించే పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా లేదు. కొద్ది రోజుల క్రితం రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ముఖాముఖి చర్చలే ఇందుకు ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. వాణిజ్యపరంగానూ మనదేశం అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్నది. దాంతో భారత మార్కెట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌, బిడెన్‌లలో ఎవరు అమెరికా తదుపరి అధ్యక్షుడు అయినా భారత్‌తో స్నేహంగా ఉంటారని విశ్లేషిస్తున్నారు.