శుక్రవారం 14 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 06:44:23

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

లాపాజ్‌: దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్‌ నుంచి విధులు నిర్వర్తిస్తానని గురువారం తెలిపారు. మరో టెస్ట్‌ తీసుకునే ముందు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటానని 53 ఏండ్ల జీనిన్‌ ట్వీట్‌ చేశారు. 

దీంతో దక్షిణ అమెరికాలో కరోనా సోకిన దేశాధ్యక్షుల సంఖ్య రెండుకు పెరిగింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంగళవారం ప్రకటించారు. లాటిన్‌ అమెరికన్‌ దేశమైన వెనెజులా ప్రభుత్వంలో ఉన్నతస్థాయి వ్యక్తి, రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్డాడో కాబెల్లోకు కూడా కరోనా సోకింది. అధ్యక్షుడు నికోలస్‌ ముదురో తర్వాత దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. 

అనెజ్‌ మంత్రివర్గంలో నలుగురు మంత్రులు కూడా ఇటీవల కరోనా పాజిటివ్‌లుగా తేలారు. దీంతో తాను కూడా పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఆమె ప్రకటించారు. బొలీవియాలో సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు కరోనా సోకడం గమనార్హం. అక్కడ సెప్టెంబర్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో మొత్తం కోటి 10 లక్షల జనాభా ఉండగా, అందులో ఇప్పటికే 43 వేల మంది కరోనా బారిన పడ్డారు. అందులో 1500 మంది మరణించారు.


logo