ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు

- యెమెన్‌లోని ఆడెన్‌లో ఘటన
- 26 మంది మృతి, వందలాది మందికి గాయాలు
- పేలుడుకు ముందే ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని, మంత్రుల విమానం
- దాడి వెనుక హౌతీ తిరుగుబాటుదారులు?
సనా (యెమెన్), డిసెంబర్ 30: భారీ పేలుడుతో మధ్యప్రాచ్య దేశం యెమెన్ దద్దరిల్లింది. దక్షిణ యెమెన్‌లో ఆడెన్ నగరంలోని విమానాశ్రయంలో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో విమానాశ్రయ ప్రాంగణంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రన్‌వేపై దట్టమైన పొగ అలుముకున్నది. పేలుడు జరిగే కంటే కొన్ని నిమిషాల ముందు ఆ దేశ క్యాబినెట్ మంత్రులు ప్రయాణిస్తున్న ప్రభుత్వ విమానం ఒకటి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
ప్రధాని మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్‌తో పాటు పలువురు మంత్రులు విమానం నుంచి దిగుతూ ఉండగానే పేలుడు ఘటన జరిగింది. అయితే, ప్రధాని సహా మంత్రులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. పేలుడు శబ్దాలు విన్న మంత్రులు కొందరు విమానం లోపలికి పరిగెత్తారని పేర్కొన్నారు. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రధానితో పాటు మంత్రులందరినీ హుటాహుటిన అక్కడి నుంచి తరలించినట్టు చెప్పారు. మంత్రులకు స్వాగతం పలికేందుకు వచ్చిన పలువురు రాజకీయ నేతలు, అభిమానులు గాయపడ్డారని తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థ కూడా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇరాన్ మద్దతుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. యెమెన్ అధ్యక్షుడు అబెడ్ రాబ్బో మన్సోవర్ హదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, యూఏఈ నేతృత్వంలో పనిచేస్తున్న దక్షిణ యెమెన్ వేర్పాటువాదుల కూటమికి మధ్య ఇటీవల సయోధ్య కుదిరింది. ఒప్పందంలో భాగంగా హదీ క్యాబినెట్‌ను నెలక్రితం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఇటీవలే ప్రమాణం చేశారు. కాగా దేశ రాజధాని సనాతో పాటు ఉత్తర యెమెన్‌లోని పలు కీలక ప్రాంతాలు హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నాయి.
టార్గెట్ మా విమానమే
పేలుడు జరిగిన సమయంలో తాను విమానంలో ఉన్నానని, రెండు పేలుడు శబ్దాలను విన్నానని యెమెన్ సమాచార శాఖ మంత్రి నగుయిబ్ ఆల్-అవగ్ తెలిపారు. డ్రోన్ల సాయంతోనే ఈ పేలుళ్లు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. తాము ప్రయాణించిన విమానాన్ని పేల్చివేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు ఆరోపించారు. ఎయిర్‌పోర్టులో తాము తుపాకీ కాల్పుల శబ్దాలను కూడా విన్నామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి