బీజింగ్: బిట్‌కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై చైనా ఉక్కుపాదం మోపింది. ఈ అనధికార కరెన్సీల్లో మారకం చట్టవిరుద్ధమని చైనా పీపుల్స్ బ్యాంకు శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కృత్రిమ కరెన్సీల్లో లావాదేవీలు అక్రమ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయని తెలిపింది. బిట్‌కాయిన్, ఈథరియం, తదితర డిజిటల్ కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, మనీలాండరింగ్ వంటి నేరాలకు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఈ కరెన్సీ వలలో పడకుండా ఉండేందుకు పీపుల్స్ బ్యాంకు ప్రచారోద్యమం చేపట్టింది. 2013లోనే చైనా ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ క్రిప్టోకరెన్సీలను నిషేధించింది. అయినా చాపకింద నీరులా ఇవి వ్యాపించకుండా ప్రస్తుతం కట్టడి చేస్తున్నది.