శనివారం 30 మే 2020
International - Apr 10, 2020 , 14:30:58

వ్యాక్సిన్ త‌యారీపై కుట్ర‌లు.. ఆరోప‌ణ‌లు కొట్టిపారేసిన బిల్ గేట్స్‌

వ్యాక్సిన్ త‌యారీపై కుట్ర‌లు.. ఆరోప‌ణ‌లు కొట్టిపారేసిన బిల్ గేట్స్‌

హైద‌రాబాద్‌: ఐటీ మొఘ‌ల్ బిల్ గేట్స్‌పై కొన్ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి నోవెల్ క‌రోనా వైర‌స్‌ను క్రియేట్ చేసింది ఆయ‌నే అన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. అంటువ్యాధుల‌ను అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ త‌యారీల కోసం భారీ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు అయిదేళ్ల క్రిత‌మే బిల్ గేట్స్ తెలిపారు. 2015లోనే వాంకోవ‌ర్‌లో జ‌రిగిన టెడ్ టాక్స్ స‌మావేశంలో గేట్స్ ఈ అంశం గురించి మాట్లాడారు.  మిస్సైళ్లు, బంక‌ర్లు కాదు.. రాబోయే భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్లు త‌యారు చేయాల‌ని ఆయ‌న ఆ స‌మావేశంలో పేర్కొన్నారు. అందుకే త‌మ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ వ్యాక్సిన్ కంపెనీల‌కు భారీగా నిధుల‌ను ఇచ్చిన‌ట్లు చెప్పుకొచ్చారు.  అయితే ఇప్పుడు నెటిజెన్లు కొంద‌రు గేట్స్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.  వ్యాక్సిన్ అభివృద్ధిలో బిల్ గేట్స్ ఎందుకు అంత భారీ పెట్టుబ‌డులు పెట్టార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

వాస్త‌వానికి 2015 లో వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా వ‌చ్చిన‌ప్పుడు ప‌దివేల మంది చ‌నిపోయారు. అయితే ఇలాంటి మ‌హమ్మారులు మ‌ళ్లీ జ‌న‌హ‌న‌నాన్ని కొన‌సాగించకుండా ఉండేందుకు ఆయ‌న వ్యాక్సిన్ త‌యారీపై దృష్టి పెట్టారు.  ఇప్పుడు కూడా బిల్ గేట్స్ ఏడు కంపెనీల‌కు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.  కోవిడ్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఎటువంటి ఆల‌స్యం చేయ‌కుండా.. ఎంత డ‌బ్బు వృధా అయినా.. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ త‌యారీ చేయాల‌న్న సంక‌ల్పంతో గేట్స్ ఉన్నారు. స‌మ‌య‌మే ముఖ్య‌మ‌న్నారు. ఈ నేప‌థ్యంలో చైనాకు చెందిన సీసీటీవీతో ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.  ఆ విష‌యాల‌ను ప‌రిశీలిద్దాం.

 మీరే ఈ వైర‌స్‌ను క్రియేట్ చేశార‌ని జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు గేట్స్ స్పందిస్తూ.. ప్ర‌పంచాన్ని సంసిద్ధం చేస్తున్న‌వారిని నిల‌దీయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌లు మాత్రం వ్యాక్సిన్ త‌యారీ కోసం పాజిటివ్‌గానే ఉన్న‌ట్లు చెప్పారు. ర‌క‌ర‌కాల అంటువ్యాధుల అధ్య‌య‌నం కోసం బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు గేట్స్ తెలిపారు. అంత‌తెలియ‌న వ్యాధి మ‌హ‌మ్మారిగా మారేటువంటి వాటిని కూడా స్ట‌డీ చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌నం ఒక వింత స‌మ‌స్య‌లో ఉన్నాం, అలాంట‌ప్పుడు రూమ‌ర్స్ కూడా క్రేజీగానే ఉంటాయ‌న్నారు. ప్ర‌స్తుత కోవిడ్ మ‌హ‌మ్మారిని ఆపాలంటే, వ్యాక్సిన్ డెవ‌ల‌ప‌ర్స్ అవ‌స‌ర‌మ‌న్నారు.

ఒక్క దేశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌లేమ‌ని, ప్ర‌పంచం మొత్తాన్ని ఉప‌యోగ‌ప‌డేలా వ్యాక్సిన్ ఉండాల‌న్నారు. వ్యాక్సిన్ రీస‌ర్చ్‌, ఫ్యాక్టరీలు లేన‌టువంటి దేశాల‌కు కూడా మ‌న ప‌రిశోధ‌న చేరాల‌న్నారు. భూమిమీదున్న ప్ర‌తి ఒక్క‌రు వినియోగించే రీతిలో వ్యాక్సిన్ నిధుల‌ను వాడాల‌న్నారు. చాలా సుర‌క్షిత‌మై, ప్ర‌భావంత‌మైన‌, త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఉత్ప‌త్తి చేసే రీతిలో ఉండే కోవిడ్‌19 టీకాను అభివృద్ధి చేయాల‌ని గేట్స్ తెలిపారు. అంద‌రికీ టీకా అందేవిధంగా చూడ‌డ‌మే గేట్స్ ఫౌండేష‌న్ ఉద్దేశ‌మ‌న్నారు. టీకా త‌యారు చేసే ఆవిష్క‌ర్త‌ల‌కు ఎందుకు నిధులు ఇస్తామంటే, వాళ్లు ప్ర‌జ‌ల‌కు చాలా చౌక‌ధ‌ర‌లో టీకాను త‌యారు చేయాల్సి ఉంటుంద‌న్నారు. లాభాపేక్ష లేకుండా ఈ ప‌నిచేయాల‌న్నారు. 

కోవిడ్‌19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో చైనా స‌ఫ‌ల‌మైన‌ట్లు గేట్స్ తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్యాధి చుట్టుముట్టేస్తుంటే.. అలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో చైనా చాలా క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌తో ఆ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను దాట‌వేసింద‌న్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెల్త్ వ‌ర్క‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌న్నారు.
logo