శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 09, 2020 , 11:10:24

ఇండియాను చూసి నేర్చుకోవాలి: బిల్ గేట్స్‌

ఇండియాను చూసి నేర్చుకోవాలి: బిల్ గేట్స్‌

న్యూయార్క్‌: ఇండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌. ప్ర‌స్తుతం చైనాను కాకుండా మ‌రో దేశంపై అధ్య‌య‌నం చేయాల‌నుకుంటే అది క‌చ్చితంగా ఇండియానే అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్థికప‌ర‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు, స‌మ్మిళిత వృద్ధి విష‌యంలో భార‌త్ విధానాలు చాలా బాగున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా నోట్ల రద్దు త‌ర్వాత డిజిట‌ల్ పేమెంట్లు పెరిగిన విధానాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ విధానాల వ‌ల్ల పేద‌ల‌కు ప్ర‌భుత్వ సాయం సులువుగా జ‌ర‌గ‌డంతోపాటు పంపిణీ ఖ‌ర్చు కూడా భారీగా త‌గ్గింద‌ని బిల్ గేట్స్ చెప్పారు. ప్ర‌స్తుతం ఇండియాలాగే వివిధ దేశాల్లోనూ ఇలాంటి ఓపెన్ సోర్స్ టెక్నాల‌జీల‌ను అభివృద్ధి చేసే దిశగా త‌మ ఫౌండేష‌న్ ప‌ని చేస్తోంద‌ని వెల్ల‌డించారు. 

ఇండియాలో ఆవిష్క‌ర‌ణ‌లు చాలా అద్భుతంగా ఉన్నాయ‌ని కొనియాడారు. యూపీఐ ప్లాట్‌ఫామ్ వ‌ల్ల డిజిట‌ల్ పేమెంట్లు చాలా సులువ‌య్యాయి. పేటీఎం, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, వాల్‌మార్ట్‌లాంటి సంస్థ‌లు ఈ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను ఉప‌యోగిస్తున్నాయి. ఈ విష‌యంలో ఇండియా ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని గేట్స్ అన్నారు. ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పంపిణీలోనూ ఇలాంటి ఆవిష్క‌ర‌ణ‌లు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వ్యాక్సిన్‌పై ధ‌నిక దేశాల పెత్త‌నం ఉండ‌కూడ‌ద‌ని, అది అన్ని దేశాల ప్ర‌జ‌ల‌కు అందేలా తాము వివిధ దేశాల్లో వ్యాక్సిన్ తయారీదారుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు. ఇండియాలోని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతోనూ తాము మాట్లాడుతున్న‌ట్లు వెల్ల‌డించారు.