సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 16:59:37

అక్టోబర్ కల్లా కరోనా వ్యాక్సిన్‌ : డొనాల్డ్ ట్రంప్

అక్టోబర్ కల్లా కరోనా వ్యాక్సిన్‌ : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ ప్రభావకారిణిగా పనిచేయనున్నది. కరోనా వైరస్ ను కట్టడి చేయలేదని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కూడా ప్రధానాంశంగా తయారైంది. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా సురక్షితమైన టీకాను తయారుచేస్తున్నామని, ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

"కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి త్వరలో పెద్ద ఆశ్చర్యకర వార్త వింటారు, ఈ వ్యాక్సిన్ ను తీసుకురావడానికి రెండు లేదా మూడు సంవత్సరాలు పట్టేది, బదులుగా చాలా తక్కువ వ్యవధిలోనే అందుబాటులోకి రాబోతున్నది. బహుశా అక్టోబర్ నెలకల్లా రావచ్చు" అని ట్రంప్ మీడియా సమావేశంలో చెప్పారు. అలాగే ప్రస్తుతం సిద్దం చేస్తున్న టీకా చాలా సురక్షితమైనదని, చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

కొవిడ్-19 వ్యాక్సిన్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాటలను విశ్వసించబోమని డెమోక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలాదేవి హారిస్ చెప్పారు. ఇది మనందరికీ సమస్యగా మారుతుందని నేను భావిస్తున్నానన్నారు. కమలాదేవి హారిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ మీడయాకు చెప్పడం విశేషం.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా  జో బిడెన్.. హారిస్‌తో కలిసి ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌ను సవాలు చేస్తున్నారు.

కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికాలో 6.5 మిలియన్లకు పైగా కేసులు నమోదుకాగా.. 190,000 మందికి పైగా మరణించారు.


logo