e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides బైడెన్‌.. సాధించెన్‌..

బైడెన్‌.. సాధించెన్‌..

బైడెన్‌.. సాధించెన్‌..
  • 100 రోజుల్లో కరోనాపై విజయం
  • ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా
  • నాడు శవాల కుప్పలు.. నేడు మాస్కులు పక్కనపెట్టే పరిస్థితి
  • ఆరోగ్యం, ఆర్థికం సమన్వయంతోనే ఈ విజయం
  • కరోనాపై పోరుకు రూ.140 లక్షల కోట్ల ప్యాకేజీ
  • కీలకపాత్ర పోషించిన వ్యాక్సినేషన్‌
  • జనాభాలో దాదాపు సగంమందికి టీకాలు

వంద రోజులు అనేది పెద్ద కాలవ్యవధి ఏమీ కాదు. కానీ, ఆ స్వల్ప కాలవ్యవధిలోనే అమెరికా కరోనా నుంచి ఉపశమనం పొంది.. తిరిగి ఊపిరి పీల్చుకోగలిగింది. ఆత్మవిశ్వాసంతో తిరిగి నిలబడగలిగింది. ఇతర దేశాలను ఆదుకోవటానికి ముందుకొచ్చింది. ఇదంతా కొత్త అధ్యక్షుడు బైడెన్‌ సాధించిన విజయం.

ఈ ఏడాది జనవరి 20న బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేనాటికి కరోనా కోరల్లో చిక్కి అమెరికా అల్లాడిపోతున్నది. మరోవైపు పరిశ్రమలు మూతపడి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి పూట గడవని స్థితిలో ఉన్నారు. అమెరికాను కరోనా నుంచి కాపాడుకోవాలంటే టీకాలను వేగంగా, అత్యంత భారీసంఖ్యలో వేయించాలని నిర్ణయించారు. తన పాలన తొలి 100 రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు వ్యాక్సిన్‌ వేయటమే లక్ష్యమని ప్రకటించారు. ఆర్థికరంగాన్ని కాపాడుకోవటానికి భారీఎత్తున నిధులతో కూడిన ప్యాకేజీని ప్రకటిస్తానని చెప్పారు. అన్నట్లుగానే, వందరోజుల్లో వేగంగా చర్యలు తీసుకున్నారు. గురువారం తన పాలన వందో రోజున అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కరోనా నుంచి అమెరికా బయటపడిందని సగర్వంగా ప్రకటించారు. బైడెన్‌ ఈ ప్రకటన చేయటానికి కొన్ని రోజుల ముందే.. టీకా వేసుకున్నవాళ్లు మాస్కు లేకుండా బయటకు వెళ్లి రావచ్చని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

కేవలం 100 రోజుల్లో ఎలా సాధ్యమైంది?

ఆరోగ్యం, ఆర్థికం- ఇవి రెండూ ఒకదాంతో ఒకటి విడదీయరాని అంశాలని బైడెన్‌ గుర్తించారు. అందుకే ఆ రెండింటినీ పునరుద్ధరించే చర్యలను ఏకకాలంలో తీసుకున్నారు. వైరస్‌పై ఓవైపు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూనే.. మరోవైపు, ప్రజలను ఆకలిమంటల నుంచి నిరుద్యోగం నుంచి కాపాడి కనీస ఉపశమనం కలిగించే తక్షణ చర్యలు చేపట్టారు. వీటిలో అత్యంత కీలకమైనది.. వ్యాక్సినేషన్‌.

ఉద్యమంలా వ్యాక్సినేషన్‌: వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే అత్యంత వేగంగా టీకాలు వేయటమే మార్గమన్న శాస్త్రవేత్తలు, వైద్యుల సూచనకు బైడెన్‌ అగ్రపీఠం వేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను ఒక ఉద్యమంలా ముందుకు నడిపించారు. మరోవైపు, టీకాలకు కొరత రాకుండా వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు ముందస్తుగానే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు.
కరోనా నిబంధనల్లో కట్టడి: మాస్కు ధరించటం, భౌతికదూరం పాటించటం ఇతర దేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌లో ఉంచటం వంటి కరోనా నిబంధనలను బైడెన్‌ యంత్రాంగం పకడ్బందీగా అమలు చేసింది.

విస్తృత పరీక్షలు: కరోనా పరీక్షలను ప్రభుత్వం భారీ ఎత్తున జరిపించింది. దీనికోసం తాత్కాలిక పద్ధతిన లక్షలాదిమంది ఆరోగ్య సిబ్బందిని నియమించింది. కరోనా ప్రబలిన ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.

ఉత్పరివర్తనాలపై నిరంతర నిఘా: ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ కొత్తకోరలతో దాడి చేస్తున్న కరోనా వైరస్‌లో వస్తున్న ఉత్పరివర్తనాలపై అమెరికా వైద్యపరిశోధన సంస్థలు నిరంతర నిఘా పెట్టాయి. ఫలితంగా దాని లక్షణాలను గుర్తించి, అందుకు అనుగుణంగా కరోనా రోగులకు చికిత్సను అందించేలా చర్యలు తీసుకోగలిగారు.

ఎగుమతుల నిలిపివేత: అమెరికా ప్రపంచలోనే అగ్రదేశం కాబట్టి.. టీకాలను ఎగుమతి చేసి మంచి పేరు సంపాదించుకుందామని బైడెన్‌ ఆరాటపడలేదు. సరిపోయినన్ని టీకాలు నిల్వ చేసుకునేవరకూ కూడా ఒక్క టీకానూ ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఇప్పుడు అదనపు నిల్వలు ఉండటంతో.. భారత్‌ తదితర దేశాలకు పంపుతున్నారు.

1400 డాలర్ల చొప్పున సాయం: కరోనా దెబ్బకు కకావికలమైన కుటుంబాలను ఆదుకోవటానికి బైడెన్‌ సర్కారు ఒక్కో వ్యక్తికి 1400 డాలర్ల చొప్పున ఆర్థికసాయం అందించింది. దీనికోసం 40,000 కోట్ల డాలర్లను కేటాయించారు. ఆరోగ్యబీమా పథకాలను ప్రభుత్వం ప్రకటించి కోట్లాదిమందికి చికిత్స లభించేలా చూసింది.

భారీ ఆర్థిక ప్యాకేజీ: కరోనాను ఎదుర్కోవటానికి అవసరమైన వ్యాక్సినేషన్‌, చికిత్సలు, దవాఖానల్లో సదుపాయాల ఏర్పాటుతోపాటు ఆర్థికరంగాన్ని కోలుకునేలా చేయటానికి 1.9 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.140 లక్షల కోట్లు) ఆర్థిక ప్యాకేజీని బైడెన్‌ సర్కార్‌ ప్రకటించింది.

కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నవారు.. దాదాపు 14 కోట్లమంది
రెండు డోసులనూ పూర్తి చేసుకున్నవారు.. దాదాపు 8.5 కోట్లమంది
65 ఏండ్లకు పైబడిన వారిలో.. మూడింట రెండొంతుల మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.
50 ఏండ్లకు పైబడిన వారిలో.. సగం మందికిపైగా ఒక్క డోసు తీసుకున్నారు .

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బైడెన్‌.. సాధించెన్‌..

ట్రెండింగ్‌

Advertisement