శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 02:13:51

బిడెన్‌, హ్యారిసే బెస్ట్‌!

బిడెన్‌, హ్యారిసే బెస్ట్‌!

  • డెమోక్రాట్‌ అభ్యర్థులకే 
  • భారతీయ అమెరికన్ల మద్దతు
  • ఇండియాకు డొనాల్డ్‌ ట్రంప్‌ విరోధి అంటూ వ్యాఖ్యలు
  •  నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌కే మెజారిటీ ఇండియన్‌ అమెరికన్లు మద్దతు పలుకుతున్నారు. భారతీయ అమెరికన్లకు సాయపడడంలో బిడెన్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉన్నదని వారు చెబుతున్నారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను అవమానపరుస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను భారత్‌కు విరోధిగా అభివర్ణిస్తున్నారు. సిలికాన్‌ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘నాలుగేండ్ల ట్రంప్‌ పాలనలో ఇంతకుముందు ఉన్నట్లుగా మాకు, మా పిల్లలకు అవకాశాలు లేవు. మన కమ్యూనిటీని, మన విలువలను గౌరవించే వ్యక్తి, సమాన అవకాశాలు కల్పించే వ్యక్తి అధ్యక్షుడు కావాల్సిన అవసరం ఉన్నది’ అని ఆయన పేర్కొన్నారు. బిడెన్‌, హ్యారిస్‌ జోడీనే దేశాన్ని తిరిగి గాడిలో పెట్టగలదని, అలాగే భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పరచగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

మోదీతో స్నేహం ఫొటోలకు ఫోజులిచ్చేందుకే..

భారత్‌కు నిజమైన స్నేహితుడు ఎవరో, శత్రువు ఎవరో ఇండియన్‌ అమెరికన్లకు బాగా తెలుసునని అజయ్‌ జైన్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ భారత్‌కు విరోధి అని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన అధ్యక్షుల చివరి డిబేట్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ భారత్‌ చెప్పే కరోనా గణాంకాలను నమ్మలేమని, భారత్‌ నిండాకలుషితమైన గాలేనని అన్నారని జైన్‌ మండిపడ్డారు. హెచ్‌1 వీసాలను సస్పెండ్‌ చేశారని, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను సంకట స్థితిలోకి నెట్టారని, మోదీతో స్నేహం ఫొటోలకు ఫోజులిచ్చేందుకేనని ఆరోపించారు.


భారతీయులకు ప్రతినిధి కమల

కాలిఫోర్నియా స్టేట్‌ అసెంబ్లీ సభ్యులు యశ్‌ కర్లా మాట్లాడుతూ.. తనకు కమలా హ్యారిస్‌ రెండు దశాబ్దాలుగా తెలుసునని పేర్కొన్నారు. భారత్‌తో తన అనుంబంధాన్ని కమల గర్వంగా భావిస్తారని చెప్పారు. సుదీర్ఘకాలంగా రాజకీయ నేతగా కొనసాగుతున్న బిడెన్‌కు భారతీయ అమెరికన్ల అవసరాలు బాగా తెలుసునని పేర్కొన్నారు. కమలా హ్యారిస్‌తో భారతీయ అమెరికన్లకు ప్రభుత్వంలో మంచి ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు. భారత్‌కు బిడెన్‌ మిత్రుడని ఇండియన్‌ అమెరికన్లందరికీ తెలుసునని అదితీపాల్‌ పేర్కొన్నారు. ఒబామా-బిడెన్‌ హయాంలో అమెరికా-భారత్‌ మైత్రి బలంగా ఉండేదని, భారత్‌కే వారు మొదట ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. 

ఓటేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 10 రోజులు గడువు ఉండగానే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుండగా, శనివారమే ఆయన ఓటువేశారు. పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు అమెరికా సహా పలు దేశాల్లో అనుమతి ఉన్నది. నేరుగా గానీ, లేదా పోస్టల్‌ ద్వారా గానీ ముందుగానే ఓటు వేయవచ్చు. రద్దీని నియంత్రించేందుకు, పోలింగ్‌ తేదీల్లో అందుబాటులో ఉండని వారి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. ఫ్లోరిడాలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ట్రంప్‌ ఓటువేశారు. ఓటు వేసేటప్పుడు మాస్క్‌ ధరించిన ట్రంప్‌.. విలేకర్ల వద్దకు వచ్చినప్పుడు దాన్ని తీసివేశారు.

అమెరికన్లందరికీ ఉచితంగా టీకా:  బిడెన్‌

తాము అధికారంలోకి వస్తే అమెరికా ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.