శుక్రవారం 05 మార్చి 2021
International - Jan 20, 2021 , 18:56:41

అధికారంలోకి రాకముందే చైనా, పాక్‌లకు అమెరికా హెచ్చరికలు

అధికారంలోకి రాకముందే చైనా, పాక్‌లకు అమెరికా హెచ్చరికలు

వాషింగ్టన్: అమెరికాలో అధికారం మారుతున సమయంలోనే.. చైనా, పాకిస్తాన్ పట్ల వారి విధానాలు కూడా స్పష్టమవుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు చైనా, పాకిస్తాన్‌ దేశాలకు అమెరికా హెచ్చరికలు పంపడం.. రెండు దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్‌తో సరిహద్దు వివాదంపై వాదిస్తున్న చైనాకు వ్యతిరేకంగా అమెరికా కఠినమైన విధానం కొనసాగుతుందని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో లష్కరేతోయిబా, ఇతర భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది. భారతదేశంతో అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని కొనసాగించడమే బైడెన్ పరిపాలన యొక్క ఉద్దేశమని ఇటీవల అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన లాయిడ్‌ ఆస్టిన్‌.. సెనేట్‌ సభ్యులకు చెప్పారు.

సెనేట్ ఎదుట తన నియామకాన్ని ధృవీకరిస్తూ.. కాబోయే అమెరికా రక్షణ మంత్రి జనరల్ (రిటైర్డ్) లాయిడ్ ఆస్టిన్ మాట్లాడారు. భారతదేశంతో మన రక్షణ సంబంధానికి భాగస్వామ్యాన్ని కొనసాగించడమే విస్తృత లక్ష్యంగా పెట్టుకున్నామని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ సభ్యులకు చెప్పారు. భారత ప్రధాన రక్షణ భాగస్వామిగా కొనసాగుతామని ఆస్టిన్ తెలిపారు. అమెరికా, భారతీయ భాగస్వామ్య సైనిక ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ప్రస్తుత బలమైన రక్షణ సహకారాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.

పాకిస్తాన్‌ను హెచ్చరికలు

మరోవైపు, భారత్‌ వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్‌ను ఆస్టిన్‌ హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియను పునరుద్ధరించడంలో పాకిస్తాన్ సానుకూల కృషి చేసిందని కితాబిచ్చారు. అదేవిధంగా భారత్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాద గ్రూపులైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి సంస్థలపై పాకిస్తాన్ కొద్దిపాటి చర్యలు తీసుకోవడం సరిపోదని, ఉగ్రవాదులు, హింసాత్మక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయంగా పాకిస్తాన్ తన భూభాగాన్ని కొనసాగించడం నిలుపుదల చేయాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకువస్తామని ఆస్టిన్ చెప్పాడు.

చైనా ఇకనైనా మారాలి..

చైనా ఇప్పటికే 'ప్రాంతీయ ఆధిపత్య శక్తి'గా మారిందని, ఇప్పుడు అది నియంత్రించే ప్రపంచ శక్తిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఆస్టిన్‌ చెప్పారు. వివిధ రంగాలలో తమతో పోటీ పడటానికి, మన ప్రయత్నాలను అడ్డుకోవడానికి చైనా మొత్తంగా కృషి చేస్తోందని ఆస్టిన్ అన్నారు. చైనా ఇకనైనా మారాల్సిన అవసరం ఉన్నదని ఆస్టిన్‌ అభిప్రాయపడ్డారు. ఇలాఉండగా, భవిష్యత్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ కూడా జాతీయ భద్రతకు చైనా నుంచి ఎదురయ్యే ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలును అమెరికా బలహీనత నుంచి కాకుండా బలం నుంచి ఎదుర్కోవాలని బ్లింకెన్ అన్నారు. సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీకి నియామకాన్ని ధృవీకరించే విచారణలో బ్లింకెన్ మాట్లాడుతూ.. ఒక దేశంగా చైనా మన ప్రయోజనాలకు, అమెరికన్ ప్రజల ప్రయోజనాలకు అత్యంత సవాలుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo