గురువారం 09 జూలై 2020
International - Jun 16, 2020 , 10:28:47

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

బీజింగ్: చైనాలో కనుమరుగై పోయిందనుకొన్న కరోనా వైరస్ జాడలు మళ్లీ కనిపిస్తున్నాయి. తానింకా మిమ్మల్ని వీడిపోలేదని అక్కడి ప్రజలు హెచ్చరికలు పంపుతోంది. కరోనా మరోసారి జడలు విచ్చుకొంటుండటంతో అక్కడి ప్రజలు నానా హైరానా పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే చైనా రాజధాని బీజింగ్లో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజుల్లో నమోదైన కేసుల సంఖ్యలో 106 కు చేరుకోవడంతో అక్కడి ప్రజలు భీతావహులవుతున్నారు. ఈ కేసులన్నీ బీజింగ్ లోని ప్రసిద్ధ మార్కెట్ అయిన జిన్ఫాది మార్కెట్ నుంచే ప్రభలినట్లు అనుమానిస్తున్నారు.

దాదాపు 2 కోట్లకు పైగా జనాభా ఉన్న బీజింగ్ లోని జిన్ఫాది మార్కెట్లో కూరగాయలు, పండ్లు, మాంసం విక్కయాలు జోరుగా సాగుతుంటాయి. ఇక్కడి నుంచే రెండోసారి కరోనా జాడ కనిపించడంతో ఈ మార్కెట్ ను అధికారులు మూసివేసి మార్కెట్ తో సంబంధం ఉన్న దాదాపు 2 లక్షల మందికి నిర్దారణ పరీక్షలు జరిపేందుకు చర్యలు తీసుకొంటున్నారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే వందకు పైగా కేసులు నమోదు కావడంతో అధికారులు ఆగమేఘాల మీద రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఫెంగ్తాయ్ జిల్లాలోని ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే తప్పా ఇండ్ల నుంచి  బయటకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. 

రెండు నెలలపాటు ఒక్క కేసు కూడా లేకపోవడంతో చైనా అధికారులు ఊపిరిపీల్చుకొన్నారు. అమాంతంగా ఫెంగ్తాయ్ జిల్లాలో కరోనా వైరస్ జాడలు కనిపించడంతో డబ్ల్యూహెచ్ వో కూడా అప్రమత్తం అయింది. ఇప్పటివరకు చైనాలో కొత్తగా 40 కేసులు నమోదవగా.. వీిలో ఎనిమిది విదేశాల నుంచి వచ్చినవారిలో కనుగొన్నారు. జిన్ఫాది మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందా? అనే అనుమానాలను పటాపంచలు చేసే పనిలో అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.logo