శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 15:02:46

కరోనా సమయంలో బిలియనీర్లు అయ్యారు...! ఎలా సాధ్యం...?

కరోనా సమయంలో బిలియనీర్లు అయ్యారు...! ఎలా సాధ్యం...?

ఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలకు డిమాండ్  విపరీతంగా పెరిగి ఆయా కంపెనీల షేర్లు భారీగా ఎగిశాయి. జనవరి నుంచి అమెజాన్ సీఈవో జెప్ బెజోస్ సంపద ఏకంగా 87 డాలర్ల వరకు పెరిగింది. గత మూడు నెలల్లో అమెజాన్ షేర్లు ఇరవై ఐదు శాతం మేర పెరిగాయి. ఏడాదిలోనే దాదాపు రెండింతలయ్యాయి. దీంతో జెఫ్ బెజోస్ సంపద 200 బిలియన్ డాలర్లను దాటింది. అలాగే, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 100 బిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్నారు. అమెజాన్, టెస్లా తదితర స్టాక్స్ గత కొద్ది వారాలుగా భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఈ వారంలో కుబేరుల సంపద భారీగా పెరిగింది.

ఆగస్టు 28 నాటికి వరల్డ్ టాప్ 500 కుబేరుల సంపద ఈ వారంలో ఏకంగా 209 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే అంతకుముందు ఉన్న సంపదతో పోలిస్తే ఈ మేర ఎగిసింది. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఇప్పుడు ఎలాన్ మస్క్ చేరారు. 200 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తిగా జెఫ్ బెజోస్ నిలిచారు. బిల్ గేట్స్ నెట్ వర్త్ 116 కంటే ఎక్కువతో రెండో స్థానంలో ఉన్నారు. జుకర్ బర్గ్, మస్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ టాప్ 4 కుబేరులు.. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ సంపద కలిసి 540 బిలియన్ డాలర్లుగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఫెడ్ రిజర్వ్ కొత్త ద్రవ్యోల్భణ విధానంపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో శుక్రవారం నాటికి అమెరికాలో స్టాక్స్ ఈ వారంలో భారీగా పెరిగాయి. ఎలాన్ మస్క్ నెట్ వర్త్ ఈ ఏడాది 76.1 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. టెస్లా స్టాక్స్ ధర, స్పెస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్ప్ వ్యాల్యుయేషన్ ఇందుకు ఉపకరించింది. బెజోస్ సంపద అయితే ఈ ఏడాది దాదాపు 87 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. మాజీ భార్య మెకంజీతో విడాకుల నేపథ్యంలో అమెజాన్‌లోని తన వాటాలో 25 శాతాన్ని భరణంగా ఇచ్చారు. అయినప్పటికీ ఆ తర్వాత నుండి అతని సంపద అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది.  


logo