మంగళవారం 02 మార్చి 2021
International - Jan 22, 2021 , 02:02:34

అమెరికాలో ఐదేండ్లున్న వారికి పౌరసత్వం

అమెరికాలో ఐదేండ్లున్న వారికి పౌరసత్వం

  • తొలి రోజే కార్యక్షేత్రంలోకి కొత్త అధ్యక్షుడు 
  • 15 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు
  • వలస విధానంపై సమగ్ర బిల్లు
  • దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా రద్దు
  • పారిస్‌ ఒప్పందంలో, డబ్ల్యూహెచ్‌వోలో తిరిగి చేరిక
  • ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయాలపై వేటు

వాషింగ్టన్‌, జనవరి 21: అత్యంత వివాదాస్పదమైన రాజకీయ నిర్ణయాలతో గత నాలుగేండ్లుగా ఆటుపోట్లను ఎదుర్కొన్న అమెరికాను తిరిగి గాడిన పెట్టేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యోన్ముఖులయ్యారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి సమాయత్తమయ్యారు. విదేశాంగ విధానాలు, దేశ భద్రతకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలపై గద్దెనెక్కిన తొలిరోజే వేటు వేశారు. ఈ మేరకు 15 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. కరోనా కట్టడి కార్యాచరణ, వలస విధానం, పారిస్‌ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరడం, మెక్సికో గోడకు బ్రేక్‌, జాతివివక్షను రూపుమాపడం, ముస్లిం మెజారిటీ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షల తొలిగింపు వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. 

100 రోజుల్లో తరిమికొట్టాలి

అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బైడెన్‌ తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే ‘100 రోజులపాటు మాస్కు తప్పనిసరి’ ఉత్తర్వులపై తొలి సంతకం చేశారు. దీని ప్రకారం వచ్చే వంద రోజులపాటు అమెరికన్లందరూ ముఖానికి విధిగా మాస్కును ధరించాలి. కరోనా అంశంలో చైనాకు వంతపాడుతున్నదని ఆరోపిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలగేలా ట్రంప్‌ చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశారు. 

ముస్లిం దేశాలపై ఉన్న ప్రయాణ ఆంక్షలు రద్దు

వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరేలా బైడెన్‌ సంతకం చేశారు. పర్యావరణానికి హానికలిగించేలా ట్రంప్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు.  ఈ నిర్ణయంపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. పలు ముస్లిం దేశాలపై ట్రంప్‌ సర్కారు విధించిన ప్రయాణ ఆంక్షలను బైడెన్‌ రద్దు చేశారు. అక్రమ వలసలను నిరోధించే పేరుతో మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్‌ సర్కారు చేపట్టిన గోడ నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జాతివివక్షకు తావు లేకుండా, సమానత్వం స్పూర్తికి విఘాతం కలుగకుండా కేంద్ర విధాన నిర్ణయాలు ఉండాలని సెక్రటరీ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 

ట్రంప్‌ నాకు లేఖ రాశారు: బైడెన్‌

కార్యనిర్వాహక ఉత్తర్వులపై బుధవారం సంతకాలు చేసిన అనంతరం అధ్యక్షుడు బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం రానున్న కాలంలో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటానని పేర్కొన్నారు. శ్వేతసౌధాన్ని విడిచివెళ్లేముందు ట్రంప్‌ తన కోసం ఓ లేఖను రాసి పెట్టి వెళ్లారని బైడెన్‌ పేర్కొన్నారు. ఆ లేఖలో ఆయన తనపై ఎంతో ప్రేమపూరిత ఔదార్యాన్ని చూపించారని వెల్లడించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తన అధికారిక కార్యాలయం ఓవల్‌ ఆఫీస్‌లో స్వల్పమార్పులు చేశారు. తను కూర్చునే సీటు వెనుక తన కుటుంబం ఫొటో ఫ్రేములను ఏర్పాటు చేశారు. అమెరికా పౌరహక్కుల నేతలు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, రూసా పార్క్స్‌ శిల్పాలను గదిలో పెట్టారు. 

భారతీయులకు ఊరట

వలస విధానానికి సంబంధించిన సమగ్ర బిల్లును కాంగ్రెస్‌ ఆమోదానికి బైడెన్‌ బుధవారం పంపించారు. ‘యూఎస్‌ సిటిజన్‌షిప్‌ యాక్ట్‌-2021’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా దేశంలో అనుమతి లేకుండా నివసిస్తున్న వలస ప్రజలకు పౌరసత్వం కల్పించనున్నారు. ఈ పౌరసత్వం పొందాలంటే వలస ప్రజలు జనవరి 1, 2021నాటికి కనీసం ఐదేండ్లపాటు దేశంలో నివసిస్తున్నట్టు చూపాల్సి ఉంటుంది. మరోవైపు, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులపై ప్రస్తుతమున్న దేశాలవారీ కోటాను కూడా బైడెన్‌ ఎత్తివేశారు. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది. దీంతోపాటు డ్రీమర్స్‌ను (చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించినవారు) దేశం నుంచి వెళ్లగొట్టకుండా తాత్కాలిక ఉపశమనం కలిగించే బిల్లుకు కూడా బైడెన్‌ ఆమోదం తెలిపారు.

అమెరికన్లు కార్యసాధకులు

  • కమలాహ్యారిస్‌

వాషింగ్టన్‌: అమెరికన్లు ఎలాంటి కష్ట సమయాల్లోనైనా కార్యసాధకులేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ అన్నారు. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె లింకన్‌ మెమోరియల్‌ను సందర్శించారు. అక్కడ ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె మొదటిసారి మాట్లాడారు. ‘కష్ట సమయాల్లో కలలు కంటూ కూర్చోం. కలలను నిజం చేసుకొనే పట్టుదల, శక్తి మనకున్నాయి. మనం ధైర్యవంతులం. లక్ష్యం కోసం పోరాడేవాళ్లం’ అని కమల పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికన్లంతా కలిసి నడవాల్సిన అవసరమున్నదని తెలిపారు.

బైడెన్‌ గెలుపు.. అమెరికా గెలుపు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసిన జో బైడెన్‌కు మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు కలిసి సంయుక్తంగా ఓ వీడియో రూపొందించారు. ముగ్గురు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ఈ వీడియోలో వ్యక్తపరిచారు. ‘బైడెన్‌ గెలుపు అమెరికా గెలుపు. కొత్త ప్రభుత్వానికి అవసరమైతే సలహాలు ఇస్తాం’ అని అన్నారు. 

విద్వేషాలు తగ్గుతాయి

న్యూయార్క్‌: అమెరికా ముందున్న సవాళ్లను బైడెన్‌, కమల ధైర్యంగా ఎదుర్కొంటారని, ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెడతారని భారత సంతతికి చెందిన చట్టసభల సభ్యులు ప్రమీలా జయపాల్‌, రాజా కృష్ణమూర్తి తదితరులు విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్‌ పాలనలో ప్రజల మధ్య పెరిగిన విద్వేషాలను తగ్గించి అందరినీ ఏకం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

VIDEOS

logo