మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 09:39:00

మధ్యప్రాచ్యంలో నూతన చరిత్ర.. కుదిరిన శాంతి ఒప్పందం

మధ్యప్రాచ్యంలో నూతన చరిత్ర.. కుదిరిన శాంతి ఒప్పందం

వాషింగ్టన్‌ : ఉద్రిక్తలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో నూతన చరిత్రకు బీజం పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్‌, యూఏఈ, బక్రెయిన్‌ మధ్య దౌత్య ఒప్పందం కుదిరింది. శ్వేతసౌదం సాక్షిగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, బహ్రెయిన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ, యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ సంతకాలు చేశారు. అనంతరం వాటిని పరస్పరం బదలాయించుకున్నారు. ఇరాన్‌పై ఉమ్మడి వ్యతిరేకత, ఆ ప్రాంతంలో దూకుడునే అరికట్టేందుకు సాగిస్తున్న సంబంధాలను ఈ ఒప్పందం అధికారం చేయనున్నాయి. అయితే ఈ ఒప్పందంలో దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌, పాలస్తీనా వివాదంపై పరిష్కారం చూపలేదు. ఆ వివాదంతో ఇజ్రాయిల్‌తో సాధారణ సంబంధాలను వ్యతిరేకించరాదని, యూఏఈ, బహ్రెయిన్‌లను అమెరికా ఒప్పించగలిగింది. పాలస్తీనా భూభాగాల ఆక్రమణను నిలిపివేసినందుకు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌జాయేద్‌ అల్‌నహియాన్‌ ఇజ్రాయిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే వెస్ట్‌ బ్యాంక్‌ స్థావరాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు చెప్పారు. అరబ్ దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి సుదీర్ఘకాలం పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో మరిన్ని మధ్య ప్రాచ్య దేశాలు, ఇతర ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ ఒప్పందంపై ట్రంప్‌ మాట్లాడుతూ మధ్య తూర్పు ఆసియాలో ఒక చారిత్రాత్మక, సువర్ణాధ్యాయం ఆరంభమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలు ఒప్పందాన్ని, నాయకత్వాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, భద్రత, సామరస్యం నెలకొంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు చేసిన నేతలను అభినందించారు.  

ఇజ్రాయెల్‌తో ఇక స్నేహ సంబంధాలు.. 

అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌ను తమ శత్రువుగా భావిస్తుంటాయి. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య సుదీర్ఘకాలం నుంచి చెలరేగుతోన్న వివాదాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ వివాదం పరిష్కారమైతే తప్ప ఇజ్రాయిల్‌తో స్నేహాన్ని కొనసాగించలేమని బహిరంగంగా ప్రకటించాయి. ఆ వివాదంతో ఇజ్రాయిల్‌తో సాధారణ సంబంధాలను వ్యతిరేకించరాదని, యూఏఈ, బహ్రెయిన్‌లను అమెరికా ఒప్పించగలిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయిల్‌తో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి యూఏఈ, బహ్రెయిన్‌ ఒప్పందానికి ముందుకు వచ్చాయి. ఆయా దేశాల మధ్య శాంతియుత వాతావరణం, స్నేహ సంబంధాలు ఏర్పడడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారు. ఇజ్రాయిల్-పాలస్తీనల మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవడానికి, మధ్య తూర్పు రీజియన్‌లో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్‌తో అన్నిరకాల సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ముందుకొచ్చాయి. 1948లో ఆవిర్భవించిన బహ్రెయిన్.. యూఏఈ, ఈజిప్టు, జోర్డాన్ తర్వాత ఇజ్రాయిల్‌ సానుకూల వైఖరిని ప్రదర్శించిన నాలుగో దేశంగా నిలిచింది. ఒప్పందాన్ని అబ్రహం ఒప్పందంగా పిలుస్తున్నారు. ఒప్పంద పత్రాలను ఇంగ్లిష్‌, అరబిక్‌, హిబ్రూ భాషలలో ముద్రించగా.. అమెరికా అధ్యక్షుడితో పాటు ముగ్గురు నేతలు సంతకాలు చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo