తాలిబన్ల అరాచక పాలన కిందకు వచ్చిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ముఖ్యంగా మహిళల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. అఫ్గాన్‌లోని కొన్ని గిరిజన తెగల్లో శతాబ్దాలుగా పాటిస్తున్న ఓ ఆచారం తాలిబన్ల కారణంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అదే ‘బచ్చా పోష్’. -నేషనల్ డెస్క్
ఏమిటీ ‘బచ్చా పోష్’?
‘బచ్చా పోష్’ అనేది అనాదిగా వస్తున్న గిరిజన ఆచారం. మగ సంతానంలేని వారు తమకు పుట్టిన కూతుళ్లలో ఒకరిని మగ పిల్లాడిలాగానే పెంచుతారు. దుస్తులు, నడవడిక ఇలా అన్నీ అబ్బాయికి మళ్లే నేర్పిస్తారు.
ఎందుకు ఈ ఆచారం ఇంకా ఉన్నది?
అఫ్గాన్ సమాజంలో మహిళలపై వివక్ష ఎక్కువ. ఇంట్లోని ఆడబిడ్డలు బయటకు వెళ్లాలంటే తండ్రి లేదా సోదరుడు ఉండాలన్న నిబంధన ఇప్పటికీ కనిపిస్తుంది. దీంతో పుత్ర సంతానంలేని కొన్ని గిరిజన తెగల వాళ్లు.. తమ ఆడబిడ్డలలో ఒకరిని మగ పిల్లాడిలా సాకుతారు. కరాటే వంటి వాటిల్లో శిక్షణనిప్పిస్తారు. మిగతా ఆడపిల్లలను బయటకు తీసుకువెళ్లాల్సిన సమయాల్లో ఈ ‘బచ్చా పోష్’ వారికి రక్షణ కల్పిస్తాడు. 18 ఏండ్లు నిండేవరకూ ఇలా బాలికలు ‘బచ్చా పోష్’గా వ్యవహరిస్తారు. తర్వాత పెండ్లి చేసుకొని గృహిణిగా మారిపోతారు. అయితే, కొందరు పెండ్లి చేసుకోకుండా జీవితాంతం ‘బచ్చా పోష్’గా కూడా ఉంటారు. అయితే, ఈ ఆచారాన్ని తాలిబన్లు మంటగలుపుతారేమోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.