కోవిడ్ గర్భిణులకు పుట్టిన శిశువుల్లో యాంటీబాడీలు

హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన గర్భిణులు ప్రసవించిన శిశువుల్లో .. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సింగపూర్‌కు చెందిన గైనకాలజీ పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ గర్భిణులకు పుట్టిన పిల్లల్లో యాంటీబాడీలు ఉన్నా.. అవి ఏ మేరకు వాళ్లకు రక్షణ కల్పిస్తున్నాయో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు పరిశోధకులు చెప్పారు. మొత్తం 16 మంది గర్బిణీ మహిళల డేటా ఆధారంగా ఈ విషయాన్ని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. హై బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న మహిళల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపారు. డేటా సేకరణ సమయంలో.. 16 మంది గర్భిణుల్లో అయిదు మంది ప్రసవించారు. ఆ అయిదుగురికి పుట్టిన పిల్లల్లో యాంటీబాడీలు ఉన్నట్లు సింగపూర్ గైనకాలజీ రీసర్చ్ నెట్వర్క్ పేర్కొన్నది. పిల్లల్లోని యాంటీబాడీల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. డెలవరీ సమయంలో కోవిడ్ ఉన్న వారికి పుట్టిన శిశువుల్లో అధిక సంఖ్యలో రోగనిరోధక శక్తి కణాలు ఉన్నట్లు పసికట్టారు. అయితే పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ.. వారిలో ఉన్న యాంటీబాడీలు తగ్గుతాయా లేదా అన్న కోణాన్ని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.