బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 19, 2020 , 02:34:52

కార్చిచ్చుపై విజయం

 కార్చిచ్చుపై విజయం
  • అత్యంత అరుదైన డైనోసార్‌ చెట్లను కాపాడిన ఆస్ట్రేలియా అగ్నిమాపక సిబ్బంది

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా అగ్నిమాపక సిబ్బంది సాహసం ఓ అత్యంత అరుదైన వృక్షజాతిని కాపాడింది. లక్షల ఎకరాల్లోని అడవులను బుగ్గి చేస్తున్న కార్చిచ్చుపై తొలిసారిగా పైచేయి సాధించారు. డైనోసార్‌ చెట్లు.. శాస్త్ర పరిభాషలో వీటిని ‘వోలెమి పైన్స్‌' అని పిలుస్తుంటారు. డైనోసార్‌ల అవశేషాలతోపాటు ఈ చెట్ల శిలాజాలు లభించడంతో వీటికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలంతా భావించారు. 1994లో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని ‘వోలెమి నేషనల్‌ పార్క్‌'లో మొదటిసారిగా ఈ చెట్లను గుర్తించారు. వాటికి వోలెమి పైన్స్‌ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పార్క్‌లోని నీలి పర్వతాల మధ్యలోని లోయలో 200 డైనోసార్‌ చెట్లు మాత్రమే ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా రెండు నెలలుగా వోలెమి నేషనల్‌ పార్క్‌ దహనమవుతున్నది. ఈ నేపథ్యంలో అరుదైన డైనోసార్‌ చెట్లను కాపాడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని ఆ చెట్లపై నిత్యం నీటిని ఎగజిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంటలు ఆ ప్రాంతానికి చేరకుండా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నీళ్లను కుమ్మరించారు. తమ ప్రయత్నం ఫలించి కార్చిచ్చు వ్యాప్తి చెందడం తగ్గిందని, డైనోసార్‌ చెట్ల వరకు చేరకుండానే మంటలు ఆగిపోయాయని వోలెమి నేషనల్‌ పార్క్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ క్రస్ట్‌ తెలిపారు. న్యూ సౌత్‌వేల్స్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ అదుపులోకి రాని సంగతి తెలిసిందే. 25.5 కోట్ల ఎకరాల్లోని అడవులు దగ్ధమయ్యాయి. 2,600 ఇండ్లు ధ్వంసం కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వోలెమి నేషనల్‌ పార్క్‌ 90 శాతం బుగ్గి అయ్యింది. ఇటీవల వర్షాలు కురియడంతో క్రమంగా మంటలు అదుపులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల మోడులు చిగురిస్తున్నాయని, మొలకలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.


logo