ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 26, 2020 , 15:52:26

ఆస్ట్రేలియా కొవిడ్‌ టీకా ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్‌

ఆస్ట్రేలియా కొవిడ్‌ టీకా ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్‌

సిడ్నీ: కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు టీకాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ రష్యా మాత్రమే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసింది. అయితే, ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌  ప్రీ-క్లినికల్ టెస్ట్‌లో సక్సెస్‌ అయ్యింది. మంచి ఫలితాలను చూపించింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం ఈ టీకాను అభివృద్ధి చేసింది. ‘మాలిక్యులర్‌ క్లాంప్‌’గా ఈ టీకాకు పేరు పెట్టింది. 

కాగా, దీన్ని జంతువులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్‌ ఫలితాల వివరాలను క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం మంగళవారం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ వ్యాక్సిన్స్‌కు విడుదల చేసినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ ‘మాలిక్యులర్ క్లాంప్’ వ్యాక్సిన్ వైరస్ ఉపరితలంపై ప్రోటీన్లను లాక్ చేయడం, అస్థిరపరచడం ద్వారా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్థవంతంగా స్పందించేలా చూస్తుంది. ‘జంతువుల నమూనాలలో మా మాలిక్యులర్ క్లాంప్ వ్యాక్సిన్ సృష్టించిన తటస్థీకరించే రోగనిరోధక ప్రతిస్పందన కొవిడ్ -19 నుంచి కోలుకున్న రోగులలో కనిపించే ప్రతిరోధకాల సగటు స్థాయి కంటే మెరుగ్గా ఉంది.’  అని ప్రాజెక్ట్ కో-లీడర్ అసోసియేట్ ప్రొఫెసర్ కీత్ చాపెల్ చెప్పారు. జూలైలో ఈ వ్యాక్సిన్‌ హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదటి దశను ప్రారంభించామని వెల్లడించారు. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా సాగితే ఈ ఏడాది ముగిసేలోపు టీకాను తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo