సోమవారం 18 జనవరి 2021
International - Dec 01, 2020 , 01:36:28

చైనాపై భగ్గుమన్న ఆస్ట్రేలియా

చైనాపై భగ్గుమన్న ఆస్ట్రేలియా

  •  ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోపై ఆగ్రహం
  • అది కల్పితమన్న ఆస్ట్రేలియా ప్రధాని
  •  చైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

మెల్‌బోర్న్‌: ఒక అభ్యంతరకరమైన కల్పిత ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసినందుకు చైనా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ డిమాండ్‌ చేశారు. ఆస్ట్రేలియా రక్షణ దళాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో తాజా వివాదం అగ్నికి ఆజ్యం పోసింది. ట్విట్టర్‌లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియాన్‌ ఒక ఫొటోను పోస్టు చేశారు. ఆ గ్రాఫిక్‌ ఫొటోలో గొర్రెపిల్లను పట్టుకున్న ఓ ఆఫ్ఘాన్‌ బాలుడి గొంతులో ఆస్ట్రేలియా సైనికుడు నెత్తురోడుతున్న కత్తిని దింపుతున్నట్లుంది. ఇది ఆస్ట్రేలియా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఫొటో అబద్ధమని మోరిసన్‌ మండిపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లపై పోరాడిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఆస్ట్రేలియా దళాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆ సమయంలో (2009-2013 మధ్య) 39 మంది అమాయకులను అన్యాయంగా చంపేయడంలో ఆస్ట్రేలియా ప్రత్యేక దళాల పాత్ర ఉందని యుద్ధ నేరాలపై ఆస్ట్రేలియా భద్రతా దళాల అధిపతి ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో లిజియాన్‌ ట్విట్టర్‌లో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ ఫొటోను పోస్టు చేశారు. ‘ఆఫ్ఘాన్‌ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం షాక్‌కు గురిచేసింది. ఇటువంటి చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సైనికులను విడిచిపెట్టకూడదు’ అని ఫొటోతో పాటు రాశారు. అయితే, చైనా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోరిసన్‌ భగ్గుమన్నారు. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రభుత్వం చైనా రాయబారిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడిగింది.