బుధవారం 08 జూలై 2020
International - Jun 16, 2020 , 02:24:43

నిరసనలకు కేంద్రం.. ‘వెండీ’!

నిరసనలకు కేంద్రం.. ‘వెండీ’!

  • అమెరికాలో కొనసాగుతున్న ఆందోళనలు
  • బ్రూక్స్‌ను కాల్చిన పోలీసు సస్పెన్షన్‌ 

వాషింగ్టన్‌, జూన్‌ 15: అమెరికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు అట్లాంటాలోని వెండీ రెస్టారెంటు కేంద్రంగా మారింది. ఈ హోటల్‌ వద్ద శుక్రవారం పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు బ్రూక్స్‌కు తాత్కాలిక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు ఈ స్మారకం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. బ్రూక్స్‌ మృతికి కారణమైన పోలీసు గారెట్‌ రోల్ఫ్‌ను  అధికారులు విధుల నుంచి తొలిగించారు. మరో పోలీసు బ్రోస్నన్‌ను పరిపాలన విధులకు బదిలీ చేశారు. తుపాకీ బుల్లెట్ల వల్లే బ్రూక్స్‌ చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.  ఫ్లాయిడ్‌, బ్రూక్స్‌ హత్యలకు నిరసనగా రిచ్‌మండ్‌లో ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని అడ్డుకునే క్రమంలో అది వారిమీదకు దూసుకెళ్లింది. మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేస్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి ఫిలడెల్ఫియాలో దాదాపు 100 మంది తుపాకులు, బేస్‌బాల్‌ బ్యాట్లు పట్టుకొని క్రిస్టొఫర్‌ కొలంబస్‌ విగ్రహం వద్ద కాపలాగా ఉన్నారు. కాగా, అమెరికాలో వర్ణవివక్ష, పోలీసుల తీరుపై చర్చించాలన్న ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆమోదం తెలిపింది.

సియాటెల్‌ నిరసనలకు ఇండో-అమెరికన్‌ నేతృత్వం


వర్ణవివక్షకు వ్యతిరేకంగా సియాటెల్‌లో జరుగుతున్న ఆందోళనలకు భారత సంతతి సామాజిక వేత్త క్షమా సావంత్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఆమె అంతకుముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత ఆ రంగాన్ని వదిలి సియాటెల్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిరసనల్లో భాగంగా సియాటెల్‌ను ‘పోలీసులు ఉండని ప్రాంతంగా’(నో కాప్‌ జోన్‌)గా ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె 1973లో పుణెలో జన్మించారు. 


logo