బుధవారం 08 జూలై 2020
International - Jun 22, 2020 , 17:51:56

తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయినట్లు ఒప్పుకున్న చైనా

తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయినట్లు ఒప్పుకున్న చైనా

బీజింగ్‌: లఢక్‌లోని గల్వాన్‌లో ఈ నెల 15-16 తేదీల్లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడా మరణించినట్లు చైనా ఎట్టకేలకు ఒప్పుకున్నది.  చైనా వైపు ఉన్న మోల్డోలో సోమవారం జరిగిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చల్లో ఈ విషయాన్ని చైనా ప్రస్తావించినట్లు సమాచారం. వారం రోజుల కిందట జరిగిన చైనాతో ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనాకు చెందిన సుమారు 45 మంది సైనికులు కూడా మరణించి ఉంటారని మన సైనిక అధికారులు అంచనా వేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకు చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌, చైనా సైనిక అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. సోమవారం లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో జరిగిన చర్చల సందర్శంగా తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడా ఈ ఘర్షణలో చనిపోయినట్లు చైనా అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎంత మంది చైనా సైనికులు మరణించారన్నది మాత్రం ఆ దేశ అధికారులు స్పష్టం చేయలేదు. 

logo