శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 11:07:02

వూహాన్‌లో పుట్టిందని చెప్పడానికి ఆధారాల్లేవు

వూహాన్‌లో పుట్టిందని చెప్పడానికి ఆధారాల్లేవు

హైదరాబాద్: కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రస్తుతం చైనాను లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల సంఖ్య, మృతుల సంఖ్య తగ్గించి చెప్పిందని, సకాలంలో స్పందించలేదని, ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేదని అనేవారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. అన్నిటికన్నా తీవ్రమైన ఆరోపణ మరొకటి ఉంది. చైనా వూహాన్ లోని వైరాలజీ సెంటర్ లో కరోనాను తయారు చేసిందని, అదికాస్తా బయటకు పొక్కిందని అమెరికా అంటున్నది. వైరస్ బయటి ప్రపంచంలోకి ఎలా వచ్చింది అనేదానిపై అమెరికా లోతైన దర్యాప్తు జరుపుతున్నదని సెంక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ప్రకటించడం వెనుక ఉద్దేశం ఇదేనని భావిస్తున్నారు. వైరస్ బయటపడింది చైనా పరిశోధనా సంస్థ ఉన్న వూహాన్ లోనే కావడం వల్ల ఆరోపణలు ఎవరైనా సులువుగా చేసేయవచ్చు. అయితే మాంసం కబేళాలో గబ్బిలం లేదా పాంగోలిన్ నుంచి మనుషులకు పాకిందని చైనా శాస్త్రవేత్తలు మొదటినుంచీ చెప్తున్నారు. వూహాన్ శివారులోని కొండల మధ్యన కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది చైనా వైరాలజీ పరిశోధనా సంస్థ. చైనా సెంటర్ ఫర్ వైరస్ కలెక్షన్ కల్చర్ కూడా ఈ సంస్థలో భాగమే. అది ఆసియాలోనే అతిపెద్ద వైరస్ బ్యాంక్. 1500కు పైగా రకాలు అందులో నిల్వ చేసి ఉంచారు. ఆ భవన సముదాయంలో ఆసియాలోనే అత్యధిక భద్రతతో కూడిన క్లాస్ ఫోర్ పాథోజెన్స్ (పి-4) నిల్వ చేసే ల్యాబ్ ఉంది. మనిషి నుంచిమనిషికి వ్యాపించే ఇబోలా వంటి ఖతర్నాక్ వైరస్‌లు ఈ తరగతి కిందకు వస్తాయి. 2015లో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తికాగా 2018లో  ప్రారంభించారు. ఫ్రెంచ్ బయోఇండస్ట్రియల్ కంపెనీ అలైన్ మెయిరూ ఈ నిర్మాణానికి కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. దీని నిర్మాణానికి 4.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.300 కోట్లు) వ్యయమయ్యాయి. ఈ ల్యాబ్ లో కరోనా వైరస్‌పై పరిశోధన జరుగుతుండగా ఓ వ్యక్తికి అది సోకిందని, అలాఅలా అది ప్రపంచం అంతటా వ్యాపించిందని ప్రచారం జరుగుతున్నది. అయితే వైరస్ మూలం ఇదమిద్దమని చెప్పలేమని, మొత్తంమీద అది గబ్బిలానికి చెందిందని లండన్‌కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ హేమన్ అన్నారు. మనుషులకు ఎలా సోకిందనే విషయమై ఎన్నెన్నో కథనాలు ఉన్నాయని, అవేవీ కూడా ప్రస్తుతం రుజువు చేయగలిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు.


logo