శనివారం 11 జూలై 2020
International - Jul 01, 2020 , 06:35:06

ఇరాన్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి

ఇరాన్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని ట్రెహ్రాన్‌లో ఓ మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు సంభవించింది. నగరంలోని సైనా అట్‌హార్‌ క్లినిక్‌లో మంగళవారం రాత్రి 10.56 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, ఈ ఘటనలో క్లినిక్‌లోని 19 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని టెహ్రాన్‌ అగ్నిమాపకశాఖ అధికారి జలాల్‌ మలేకీ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు క్లినిక్‌లో 25 మంది ఉద్యోగులు ఉన్నారని, 13 మంది అక్కడికక్కడే మరణించారని, మంటలు ఆర్పిన తర్వాత మరో ఆరు మృతదేహాలు లభించాయన్నారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 

క్లినిక్‌లో గ్యాస్‌ లీకవడంతోనే పేలుళ్లు సంభవించాయని టెహ్రాన్‌ డిప్యూటీ గవర్నర్‌ హమీద్‌ రెజా తెలిపారు. పేలుళ్లతో భారీగా పొగలు కమ్ముకున్నాయని వెల్లడించారు. ఆ సమయంలో క్లినిక్‌లో చిన్న శస్త్రచికిత్సలు సాగుతున్నాయని చెప్పారు. నాలుగు రోజుల క్రితం రాజధాని నగరంలో ఉన్న మిలటరీ కాంప్లెక్స్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి.


logo