మంగళవారం 31 మార్చి 2020
International - Feb 07, 2020 , 01:20:58

రికార్డు సృష్టించిన క్రిస్టినా కోచ్‌

రికార్డు సృష్టించిన క్రిస్టినా కోచ్‌
  • సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన తొలి మహిళా వ్యోమగామిగా గుర్తింపు
  • క్రిస్టినాతోపాటు భూమికి చేరుకున్న మరో ఇద్దరు వ్యోమగాములు
  • కజకిస్థాన్‌లోని దట్టమైన మంచు ప్రాంతంలో సురక్షితంగా దిగిన క్యాప్సూల్‌
  • కజకిస్థాన్‌లోని దట్టమైన మంచు ప్రాంతంలో సురక్షితంగా దిగిన క్యాప్సూల్‌
  • రోదసిలో 328 రోజులు!

అల్మటి(కజకిస్థాన్‌), ఫిబ్రవరి 6: అంతరిక్షంలో 328 రోజుల సుదీర్ఘ కాలం గడిపిన తొలి మహిళగా నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ రికార్డు సృష్టించారు. రష్యన్‌ స్పేస్‌ ఏజన్సీకి చెందిన సోయజ్‌ కమాండర్‌ అలెగ్జాండర్‌ స్కొవొర్ట్‌ సోక్‌, యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీకి చెందిన ల్యూకా పర్మిటానోతో కలిసి ఆమె దాదాపు 11 నెలల అనంతరం గురువారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. గురువారం ఉదయం 9.12 గంటలకు(బ్రిటన్‌ కాలమానం ప్రకారం) కజకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో వ్యోమగాములతో కూడిన క్యాప్సూల్‌(సోయజ్‌ డిసెంట్‌ మాడ్యుల్‌) దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) లో 328 రోజులు గడిపిన అనంతరం వీళ్లు భూమికి చేరుకున్నారు. దట్టంగా మంచు పేరుకుపోయిన ప్రాంతంలో క్యాప్సూల్‌ దిగగానే స్థానిక ప్రజలు, ఇతరులు వీరికి ఆత్మీయ స్వాగతం పలికారు. క్యాప్సూల్‌ నుంచి దిగగానే క్రిస్టినా పెద్దగా నవ్వుతూ కనిపించగా, పర్మిటానో తన చేతి పిడికిళ్లను విదిలిస్తూ కనిపించారు. 


మరో వ్యోమగామి స్కొవొర్ట్‌ సోక్‌ ఆపిల్‌ పండును తింటూ కనిపించారు. క్రిస్టినా గత ఏడాది మార్చి 14న స్కొవొర్ట్‌, పర్మిటానోతో కలిసి రోదసి ప్రయాణం ప్రారంభించారు. గత డిసెంబర్‌ 28నాటికి అంతరిక్షంలో ఆమె 289 రోజులు గడిపారు. దీంతో అప్పటివరకూ అంతరిక్షంలో ఎక్కువరోజులు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పిన మరో నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ రికార్డును ఆమె బద్దలు కొట్టారు. దీంతోపాటు మరో నాసా మహిళా వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి క్రిస్టినా గత అక్టోబర్‌లో ఒకేసారి స్పేస్‌వాక్‌ను పూర్తి చేసి కొత్త చరిత్రను సృష్టించారు. అంతరిక్ష చరిత్రకు సంబంధించి ఇద్దరు మహిళలు ఒకేసారి స్పేస్‌వాక్‌ చేయడం ఇదే తొలిసారి. అయితే, ఐఎస్‌ఎస్‌లో మహిళలకు సరిపోయే రెండు స్పేస్‌సూట్‌లు లేకపోవడంతో ఈ ప్రయోగం అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా జరిగింది. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అంతరిక్ష ప్రయోగాల్లో మహిళలకు తగినంత ప్రాధాన్యత లేదని, లింగ వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదని పలువురు మండిపడ్డారు. కాగా సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరెష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 1963లో ఆమె ఈ ఘనత సాధించారు. logo
>>>>>>