శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 16, 2020 , 03:09:50

ఆరు రోజుల జాప్యం.. అందుకే విలయం!

ఆరు రోజుల జాప్యం.. అందుకే విలయం!

  • చైనా అలసత్వంపై అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం

వుహాన్‌, ఏప్రిల్‌ 15: కరోనా గురించి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో చైనా అలసత్వం వహించిందా? వైరస్‌కి సంబంధించిన సమాచారాన్ని ఆరు రోజుల పాటు దాచిపెట్టి.. వుహాన్‌లో మహమ్మారి విరుచుకుపడటానికి పరోక్షంగా కారణమయ్యిందా? ప్రఖ్యాత న్యూస్‌ ఏజెన్సీ ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌' తాజాగా వెల్లడించిన వివరాలను చూస్తే ఇవన్నీ నిజమేననిపిస్తున్నాయి. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులకు కరోనానే కారణమని జనవరి 14న అధికారులు నిర్ధారణకు వచ్చినప్పటికీ, ప్రధాని జిన్‌పింగ్‌ ఆ విషయాన్ని ప్రజలకు ఆరు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 20న తెలియజేశారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. అయితే, అప్పటికే 3 వేల మందికి పైగా వైరస్‌ సోకిందని వెల్లడించింది. చైనా కొత్త సంవత్సర ఉత్సవాలు (లూనార్‌ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌) కొనసాగుతుండటంతో వేలాది మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సాగించారని, దీంతో వైరస్‌ తొందరగా వ్యాపించి మహమ్మారిగా మారిందని పేర్కొంది. అధికార వర్గాలకు సంబంధించిన అంతర్గత పత్రాల్లో ఈ విషయాలు ఉన్నాయని తెలిపింది. ఒకవేళ అధికారులు ఆరు రోజుల ముందే వైరస్‌ గురించి ప్రజలను హెచ్చరిస్తే, కరోనా రోగులు తక్కువగా ఉండేవారని, రోగుల చికిత్సకు తగినన్ని వైద్య సదుపాయాలు ఉండేవని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా, వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని ప్రజలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చేరవేశామని చైనా చెబుతున్న విషయం తెలిసిందే.


logo