ఇరాన్ అణు శాస్త్రవేత్త హత్య

- కారులో వెళుతుండగా దాడి.. ట్రక్కును పేల్చి, కాల్పులు జరిపిన దుండగులు
- ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపణ
- ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
టెహ్రాన్: ఇరాన్ అణు పితామహుడిగా పేరొందిన మొసిన్ ఫక్రిజ్దా శుక్రవారం హత్యకు గురయ్యారు. రాజధాని టెహ్రాన్‌కు శివారులో ఉన్న అబ్సర్ద్ ప్రాంతం వద్ద ఆయన కారుపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ‘ఒక పాత ట్రక్కులో కట్టెల లోడు కింద పేలుడు పదార్థాలు దాచి పెట్టారు. ఆ ప్రాంతానికి మొసిన్ కారు రాగానే... ట్రక్కు దూసుకొచ్చింది. కారు దగ్గర్లో ట్రక్కును పేల్చివేశారు’ అని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. ‘ట్రక్కును పేల్చేయడంతో మొసిన్ కారు ఆగిపోయింది. వెంటనే ఐదుగురు వ్యక్తులు వచ్చి కారులో ఉన్న ఆయనపై కాల్పులు జరిపారు’ అని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడిలో మొసిన్ అంగరక్షకులతో సహా మరికొందరు గాయపడ్డారు. మొసిన్ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ చెప్పారు. మొసిన్ హత్యతో తమ అణు కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. ‘ఇరాన్ శాస్త్రవేత్తను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ పిరికిపంద చర్యలో ఇజ్రాయెల్ హస్తం ఉంద’ని ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దం కిందట కూడా ఇరాన్ అణు శాస్త్రవేత్తల్లో పలువుర్ని హత్య చేసిందన్న ఆరోపణలు ఇజ్రాయెల్‌పై ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక సందర్భంలో మొసిన్ గురించి మాట్లాడుతూ ‘ఆ పేరును గుర్తుంచుకోండి’ అని ప్రజలకు సూచించారు. మొసిన్ హత్య ఇరాన్‌కు గట్టి దెబ్బ అని ఇజ్రాయెల్ జర్నలిస్టు చేసిన ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేశారు. ఏడాది కిందట బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమాని మరణించారు.