గురువారం 28 మే 2020
International - Apr 12, 2020 , 13:44:23

స్వీయ నిర్బంధంలో ఇద్దరు బిడ్డలకు తండ్రి అయిన అసాంజే

స్వీయ నిర్బంధంలో ఇద్దరు బిడ్డలకు తండ్రి అయిన అసాంజే

హైదరాబాద్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే స్వీయనిర్బంధంలో ఉంటూనే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయినట్టు మెయిల్ పత్రిక వెల్లడించింది. దశాబ్దకాలంగా ఆయన లండన్‌లోని ఈక్వడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. అమెరికా తదితర దేశాల రహస్య పత్రాలను వికీలీక్స్ లో బయటపెట్టిన అసాంజేపై అమెరికాలో కేసులున్నాయి. ఆయన బయటకు వస్తే అరెస్టు, శిక్షలు ఖాయం. అందుకే ఆయన చాలాకాలంపాటు రాయబార కార్యాలయం వదిలిపెట్టి బయటకు రాలేదు. అలా స్వీయ నిర్బంధంలో ఉంటూనే ఆయన తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మారిస్ ద్వారా ఇద్దరు మగబిడ్డలకు తండ్రి అయ్యారట. వారిలో ఒకరికి ఏడాది, మరొకరికి రెండేళ్ల వయసు. దక్షిణాఫ్రికాలో జన్మించిన స్టెల్లాతో అసాంజేకు 2017లో నిశ్చితార్థం కూడా అయ్యిందట. గతనెల అసాంజే కోర్టుకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ సంగతి తెలుసుకున్నట్టు మెయిల్ ఆదివారం సంచికలో రాసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈక్వడార్ దౌత్యరక్షణను ఉపసంహరించడంతో బ్రిటన్‌కు లొంగిపోయారు. ప్రస్తుతం అసాంజే లండన్‌లోని బెల్‌మార్ష్ జైలులో ఉంటున్నారు. కోరనా వైరస్ వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ బెయిలు కోసం సమర్పించిన దరఖాస్తు లండన్ కోర్టు కొట్టివేసింది. కోరనా భయాల మధ్య ఖైదీలను విడుదల చేయాలన్న ప్రతిపాదనలో భాగంగా అసాంజేను విడుదల చేయాలని న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఈ వాదనల సందర్భంగానే న్యాయవాది స్టెల్లా తనకు, అసాంజేకు మధ్య గల సంబంధాన్ని వెల్లడించారు. తన సంతానం గురించి కూడా కోర్టుకు తెలియజేశారు. ఎన్ని చెప్పినా కోర్టు మాత్రం బెయిలుకు ఒప్పుకోలేదు. 


logo