మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 16:31:24

ఇమ్రాన్‌ఖాన్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్న అసిమ్‌ బజ్వా

ఇమ్రాన్‌ఖాన్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్న అసిమ్‌ బజ్వా

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సలహాదారు పదవి నుంచి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్‌) అసిమ్ సలీమ్ బజ్వా తప్పుకున్నారు. తన రాజీనామాను సోమవారం ప్రకటించారు. అవినీతి కుంభకోణం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్  రాజీనామా చేసేందుకు ముందుకురావడంతో.. సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు బజ్వా వెల్లడించారు. ప్రధానికి సమాచార, ప్రసార విభాగంలో ప్రత్యేక సహాయకునిగా బజ్వా పనిచేశారు. అయితే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ (సీపిఇసి) అథారిటీకి నాయకత్వ బాధ్యతలను అలాగే కొనసాగించనున్నారు. "ప్రత్యేక సహాయకుడి పదవిని విడిచిపెట్టేందుకు అనుమతించాలని గౌరవ ప్రధానమంత్రిని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆయన చాలా దయతో ఆమోదించారు" అని బజ్వా సోమవారం ట్వీట్ ద్వారా తెలిపారు. 

తన కుటుంబ ఆస్తులు ఒకేసారి విపరీతంగా పెరిగాయన్న విషయం వెలుగులోకి వచ్చిన తరువాత అసిమ్ బజ్వా గత నెలలోనే తన రాజీనామా పత్రాన్ని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అందించినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యంలో ఉన్న కాలంలో బజ్వా కుటుంబ ఆస్తులు చెప్పలేనంతగా పెరిగాయి. అతని కుటుంబం అమెరికాలో బాజ్కో పేరిట వ్యాపారం చేస్తున్నది. అలాగే అనేక అమెరికా రాష్ట్రాల్లో పాపా జాన్ యొక్క పిజ్జేరియా అవుట్లెట్లను కలిగి ఉన్నది.

తన ప్రభావాన్ని, శక్తిని ఉపయోగించుకుని విదేశీ గడ్డపై కుటుంబీకులు వ్యాపారాలను ప్రారంభించారని జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ సోషల్‌ మీడియాలో ప్రచురించిన కథనం వైరల్‌ కావడంతో బజ్వా అవినీతి బయటపడింది. అసిమ్‌ బజ్వా సోదరుడు నదీం 2002 లో అమెరికాలోని పాపా జాన్స్‌ పిజ్జా డెలివరీ మ్యాన్‌గా పనిచేశారు. ముషారఫ్‌ కాలంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి బజ్వా ఎదిగిన తర్వాత.. నదీం 40 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 133 పాపా జాన్స్‌ పిజ్జా రెస్టారెంట్లకు యజమానిగా మారారు. ప్రధాని సలహాదారు పదవికి రాజీనామా చేసినప్పటికీ.. సీపీఈసీ అథారిటీలో శక్తివంతమైన, లాభదాయకమైన పదవిలో బజ్వా కొనసాగనున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo