ఆదివారం 17 జనవరి 2021
International - Dec 08, 2020 , 16:03:36

సౌదీ అరేబియా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే

సౌదీ అరేబియా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే

న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలో పర్యటించేందుకు బయల్దేరి వెళ్లారు. 2020 డిసెంబర్ 9 నుండి 14 వరకు ఐదు రోజుల పాటు ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇరు దేశాల సీనియర్ సైనికాధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటన చారిత్రాత్మకమైనదని భారత్‌ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఆర్మీ చీఫ్ యూఏఈ, సౌదీ అరేబియా దేశాలను సందర్శించడం భారత ఆర్మీ చరిత్రలో ఇదే తొలిసారి.

ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రేపటి నుంచి 10 వరకు యూఏఈలో పర్యటిస్తారు. అక్కడ సీనియర్ సైనిక అధికారులతో భేటీ అవనున్నారు. భారత్, యూఏఈ రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించనున్నారు. ఆర్మీ చీఫ్ తన పర్యటన రెండో దశలో డిసెంబర్ 13 నుంచి 14 వరకు సౌదీ అరేబియాలో పర్యటిస్తారు. సౌదీ అరేబియా, భారతదేశం మధ్య అద్భుతమైన రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై చర్చిస్తారు. వివిధ రక్షణ సంబంధ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు. ఆర్మీ చీఫ్ రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం, జాయింట్ ఫోర్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం, కింగ్ అబ్దులాజీజ్ యుద్ధ కళాశాలను సందర్శిస్తారు. సీఓఏఎస్‌ నేషనల్ డిఫెన్స్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.