శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 13:11:47

ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం..

ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం..

హైద‌రాబాద్‌: ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య భీకర యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసందే. అయితే ఆ యుద్ధానికి ప్ర‌స్తుతం తాత్కాలిక బ్రేక్ ప‌డింది. న‌గొర్నో క‌ర‌బ‌ఖ్ ప్రాంతంలో కాల్పుల విర‌మ‌ణ‌కు రెండు దేశాలు అంగీక‌రించాయి.  మాస్కోలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఈ ఒప్పందం కుదిరించి. ఆదివారం నుంచి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం అమ‌లులోకి రానున్న‌ది. ఖైదీల‌ను.. కాల్పుల్లో మ‌ర‌ణించిన వారిని  అప్ప‌గించేందుకు ఒప్పందం కుదిరిన‌ట్లు రెండు దేశాల దౌత్యాధికారులు వెల్ల‌డించారు. అయితే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం.. సంక్షోభ పరిష్కారానికి దారి తీస్తుంద‌ని ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గేవ్ ల‌వ్‌రోవ్ తెలిపారు. శాంతియుత చ‌ర్చ‌ల‌కు రెండు దేశాలు అంగీక‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే కాల్పుల విర‌మ‌ణ‌కు సంబంధించిన పూర్తి ఒప్పందాల‌ను ఇంకా వెల్ల‌డించాల్సి ఉన్న‌ది. 

క్రిస్టియన్లు అధికంగా ఉండే ఆర్మేనియా, ముస్లిం రాజ్యమైన అజర్‌బైజాన్‌ మధ్య నగొర్నో కరబఖ్‌ ప్రాంతం కోసం యుద్ధం ప్రారంభమైంది. అక్క‌డి సరిహద్దుల్లో విరామం లేకుండా ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. ఆర్మేనియన్‌ జాతి ప్రజలు అధికంగా ఉండే నగొర్నో కరబఖ్‌ ప్రాంతం అజర్‌బైజాన్‌లో భాగంగా ఉన్నది. దాంతో ఆ ప్రాంతాన్ని ఆర్మేనియాలో కలుపాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా ఆర్మేనియా రంగంలోకి దిగటంతో యుద్ధం మొదలైంది.  రెండు వారాల ఘ‌ర్ష‌ణ త‌ర్వాత రెండు దేశాలు తొలిసారి శుక్ర‌వారం చ‌ర్చ‌ల్లో పాల్గొన్నాయి. రెండు దేశాలు సైనిక చ‌ర్య‌ల‌ను ఆపేయాల‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కూడా కోరారు. సెప్టెంబ‌ర్ 27 నుంచి జ‌రుగుతున్న కాల్పుల్లో సుమారు 400 మంది మ‌ర‌ణించారు. 


logo