మంగళవారం 26 మే 2020
International - May 04, 2020 , 20:01:10

అదిగో పులి అంటే పటాలమే వచ్చింది

అదిగో పులి అంటే పటాలమే వచ్చింది

హైదరాబాద్: అసలే లాక్‌డౌన్ రోజులు. మనుషులు ఇళ్లల్లో బందీలు అయిపోతే వన్యప్రాణులు రోడ్ల మీదకు వచ్చి సంచారం చేస్తున్నాయనే కథనాలు చాలానే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోని కెంట్‌లో ఓ ఇంటిదగ్గర పులిని చూశామని కొందరు అధికారులకు తెలియేజేశారు. ఇంకేముంది? సాయుధ పోలీసు బలగం, వారికి అండగా ఓ పోలీసు హెలికాప్టర్ ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పులిని సమీపించాయి. ఇక ఒడిసి పట్టుకోవడమో, మొరాయిస్తే కాల్చి పారేయడమో తరువాయి. పులి ఉన్నచోటే ఉంది. కదల్లేదు. దగ్గరకు వెళ్లి చూస్తే కథ అడ్డం తిరిగింది. అది అసలు నిజం పులికాదు. ఓ బొమ్మ. దానిని తయారు చేసింది ఓ చిలిపి.. సారీ శిల్పి బామ్మ. 20 ఏళ్ల క్రితం కబూతర్ జాలీ, గుజ్జుతో జూలియట్ సింప్సన్ (85) తయారు చేసిన పులి శిల్పం అది. ఆమె కళా కౌశలాన్ని మెచ్చుకుంటూ పోలీసులు ఉసూరుమంటూ హెలికాప్టర్‌తో సహా వెనుదిరిగారు. తమ ఇంటి దగ్గర ఎప్పటి నుంచో పడిఉన్న పులిబొమ్మ కోసం పోలీసులు, హెలికాప్టర్ రావడం చూసి ఇంట్లోని వారంతా డంగైపోయారు. మనుమరాలు మార్థా బామ్మ చేసిన పులి, అది సృష్టించిన హంగామాను ట్విట్టర్‌లో పంచుకున్నారు. నెటిజనులు శబాసో బామ్మ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.


logo