మంగళవారం 26 మే 2020
International - May 14, 2020 , 11:55:15

ఇంతకూ పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం ఎంత?

ఇంతకూ పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం ఎంత?

హైదరాబాద్: చాలాదేశాలు కరోనా నియంత్రణలను సడలిస్తున్నాయి.  పిల్లలను బడికి పంపేందుకు అనుమతిస్తున్నాయి. వారి ఆటపాటలపై నియంత్రణలను ఎత్తేస్తున్నాయి. అసలు ఇంతకూ పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందా?  ఎంతమేరకు చూపుతుంది? పిల్లలను బయటకి వదులుతున్నారు కనుక ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. నిర్ధారిత కోవిడ్-19 కేసుల్లో చిన్నారుల సంఖ్య చాలాచాలా తక్కువ. చైనా, ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా పాజిటివ్ లలో 18 సంవత్సరాల లోపు వయసువారి సంఖ్య 2% లోపే. బ్రిటన్‌లో కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన 18 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య కూడా 2% లోపే. అంటే పిల్లలకు కరోనా సోకదని దీని అర్థమా? పిల్లలకు కరోనా సోకితే తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెప్పడానికి బోలెడు ఆధారాలున్నాయి. అయితే పిల్లలు కరోనాతో తీవ్రంగా జబ్బుపడిన లేదా మరణించిన అరుదైన సందర్భాలూ లేకపోలేదు. 

కోవిడ్ సోకే అవకాశాలు పిల్లలకు తక్కువేనని చెప్పేందుకు మాత్రం స్పష్టమైన ఆధారాలు లేవు. పరీక్షలు తక్కువగా జరపడం, అందులోనూ పిల్లలకు మరీ తక్కువగా జరపడం దీనికి కారణం కావచ్చు. యూరప్ లో తొలినాళ్లలో వైరస్ వ్యాప్తికి ప్రయణాలు చేసిన వయోజనులు ఎక్కువగా కారకులయ్యారు. పిల్లలు అంతగా తిరగరు కనుక సహజంగానే వ్యాప్తిలో వారి పాత్ర కూడా తక్కువే ఉంది. చైనా అధ్యయనాల్లో పదేళ్లలోపు పిల్లలకూ వైరస్ మామూలుగానే సోకుతుందని తేలింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఐస్‌ల్యాండ్ అనుభవాలను చూస్తే పిల్లలకు అంతగా సోకదని అనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు కలివిడిగా ఉండడం అనే అంశం బహుశ ఇక్కడ వేరుివేరు ఫలితాలు రావడానికి కారణమై ఉంటుంది. అనేక అంటువ్యాధులకు యూ ఆకారపు లక్షణం ఉంటుంది. అంటే పిల్లలకు, వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉంటుంది అని అర్థం. 

కానీ కోవిడ్-19 వల్ల శిశువులు, పసిపిల్లలు కూడా తేలికపాటి లక్షణాలకు మాత్రమే గురవుతారని చాలా సందర్భాల్లో రుజువైంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏస్-2 రిసెప్టర్లు వారి ఊపిరితిత్తుల్లో తక్కువగా ఉండడమే ఇందుకు కారణమనే వాదం కూడా ఉంది. వైరస్ పై పిల్లల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండవచ్చని కూడా అంటున్నారు. పెద్దల్లో రోగనిరోధకత అతిగా స్పందించి వైరస్ కన్నా ఎక్కువగా శరీరానికి నష్టం కలిగిస్తుంది. బహుశ పిల్లల్లో వైరస్ నే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.        పిల్లలు అదృశ్య వైరస్ వాహకులా? అనేది ఇంకో ప్రశ్న. వారు ఎలాంటి  లక్షణాలు లేకుండానే వైరస్‌ను వ్యాపింపజేస్తారా? ఏదిఏమైనా స్కూళ్లకు వెళ్లే  పిల్లలపై మరింత లోతుగా అధ్యయనాలు జరిపితే గానీ వారిలో వైరస్ వ్యాప్తి గురించిన స్పష్టత రాదు.


logo