బుధవారం 27 మే 2020
International - May 07, 2020 , 02:43:37

హెచ్‌1బీల పొట్టకొడుతున్నారు!

హెచ్‌1బీల పొట్టకొడుతున్నారు!

  • మార్కెట్‌లో ఉన్నదానికంటే తక్కువ వేతనాలుచెల్లింపు
  • దిగ్గజ కంపెనీలదీ ఇదే తీరు
  • తాజా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికాలోని మెజార్టీ కంపెనీలు హెచ్‌1బీ వీసాదారులకు మార్కెట్‌ కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నట్లు తేలింది. ‘హెచ్‌1బీ వీసాస్‌ అండ్‌ ప్రివైలింగ్‌ వేజెస్‌' పేరిట ‘ఎకనమిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌' విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు హెచ్‌1బీ వీసా వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఆ దేశంలో ఈ వీసా కింద దాదాపు 5 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. ‘హెచ్‌1బీ వీసా కింద ఉద్యోగులను నియమించుకునే టాప్‌ 30 కంపెనీల్లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. వీసా నిబంధనలను ఉపయోగించుకుని ఈ కంపెనీలు హెచ్‌1బీ వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనం (లోకల్‌ మీడియన్‌ వేజ్‌) కంటే తక్కువ చెల్లిస్తున్నాయి’ అని ఆ నివేదిక వెల్లడించింది. దాదా పు 60% మంది వీసాదారులు స్థానిక మధ్యస్థ వేతనం కంటే తక్కువ పొందుతున్నారని తెలిపింది. 

లెవల్‌ 1, లెవల్‌ 2 వేతనాలే..

2019లో 53,000 కంపెనీలు హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌ని ఉపయోగించుకున్నాయని నివేదిక తెలిపింది. మొత్తం 3,89,000 హెచ్‌1బీ దరఖాస్తులకు ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఆమోదం తెలుపగా, ఇందులో ప్రతి నాలుగింటిలో ఒకటి టాప్‌-30 కంపెనీలకు సం బంధించినవేనని వివరించింది. వీటిల్లో సగం కంపెనీలు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమించుకుంటున్నాయని తెలిపింది. టెక్నాలజీ కంపెనీలు చాలా వరకు నేరుగా రిక్రూట్‌ చేసుకుంటున్నాయని, అయితే వేతనాల్లో మాత్రం మీడియన్‌ వేజ్‌ కంటే దిగువన ఉంటే లెవల్‌ 1, లెవల్‌ 2 వేతనాలను చెల్లిస్తున్నాయని ఆరోపించింది. 


logo