మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 15:49:59

పాకిస్తాన్‌లో మరో ఆలయం ధ్వంసం

పాకిస్తాన్‌లో మరో ఆలయం ధ్వంసం

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో మరో హిందూ దేవాలయం ధ్వంసమైంది. ఈ ఆలయం బాడిస్‌ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగింది. ప్రస్తుతం సింధ్‌ ప్రాంతంలోని ఆలయాలన్నింటినీ కూల్చేశారని పాకిస్తాన్‌ మానవ హక్కుల కార్యకర్త అనిలా గుల్జార్‌ ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు.

సింధ్‌ ప్రాంతంలో మైనార్టీ హిందువుల విశ్వాసంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా అనేక ఆలయాలను అక్కడి చాందసవాదులు కూల్చివేస్తున్నారు. అయినప్పటికీ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. తాజాగా బాడిస్‌ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్‌ ప్రాంతంలో ఉన్న శ్రీరాముడి మందిరంపై కొందరు దాడిచేసి ధ్వంసం చేశారు. విగ్రహాలను ముక్కలు చేశారు. ఈ దాడిని హిందూ సమాజం ఖండించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బాలికలపై లైంగికదాడులు, బలవంతంగా మతమార్పిడిలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత మే నెలలో పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవాల్పూర్ నగరంలో హిందూ, క్రైస్తవ వర్గాల ప్రజల ఇండ్లు ధ్వంసం చేయడాన్ని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఏడాది ఆరంభంలో భవాల్‌పూర్‌లోని మైనారిటీ హిందూ సమాజానికి చెందిన బస్తీ కూల్చివేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇమ్రాన్‌ఖాన్ మంత్రివర్గంలో హౌసింగ్ మంత్రిగా ఉన్న తారిక్ బషీర్ చీమా, దేశ ప్రధాన సమాచార అధికారి షాహిద్ ఖోఖర్‌ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగినట్లుగా అక్కడి మీడియా కోడైకూసింది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వదం తన మతపరమైన వివక్షను మైనారిటీలపై చూపుతున్నట్లు అనేక సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, పాకిస్తాన్లోని జస్టిస్ ఫర్ మైనారిటీల ప్రతినిధి అనిలా గుల్జార్ వెల్లడించారు. సింద్‌ ప్రాంతంలోని 428 దేవాలయాల్లో ప్రస్తుతం 20 మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు.


logo