బుధవారం 08 జూలై 2020
International - Jun 07, 2020 , 18:52:25

జాత్య‌హంకార హ‌త్య‌: ‌మొన్న‌ అమెరికాలో.. నేడు బ్రెజిల్‌లో

జాత్య‌హంకార హ‌త్య‌: ‌మొన్న‌ అమెరికాలో.. నేడు బ్రెజిల్‌లో

న్యూఢిల్లీ: అమెరికాలో న‌ల్ల‌జాతీయుడైన‌ జార్జి ఫ్లాయిడ్ హ‌త్య‌ ఘటనను మరువకముందే బ్రెజిల్‌లో జాత్యహంకారానికి ఐదేళ్ల బాలుడు బలయ్యాడు. దీంతో బ్రెజిల్‌వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని రెసిఫే ప్రాంతానికి చెందిన ఇనోసెన్సియా డా సిల్వా (37) అనే నల్లజాతి మహిళ అదే ప్రాంతంలోని ఓ శ్వేతజాతి కుటుంబంలో ఇంటిప‌నులు చేస్తున్న‌ది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇనోసెన్సియా డా సిల్వా తన ఐదేళ్ల కుమారుడు మిగ్యుల్ డా సిల్వాను కూడా త‌న‌తోపాటు యజమాని ఇంటికి తీసుకెళ్తున్న‌ది. 

రోజులాగే గత మంగళవారం కూడా ఆ ఐదేళ్ల బాలుడిని ఇనోసెన్సియా డా సిల్వా తన యజమాని ఇంటికి తీసుకెళ్లింది. అనంత‌రం ఆమె తన యజమాని పెంచుకుంటున్న కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తూ త‌న కొడుకు మిగ్యుల్ డా సిల్వాను ఇంట్లోనే వదిలి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఆ ఇంటి యజమాని మిగ్యుల్ డా సిల్వాను ఒంటిరిగా లిఫ్ట్‌లోకి పంపి చివరి అంతస్తు బటన్ నొక్కింది. ఈ క్రమంలో భవనం తొమ్మిదో అంతస్తుకు చేరుకుకున్న మిగ్యుల్ డా సిల్వా బాల్కనీ నుంచి జారిపడి మరణించాడు. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇనోసెన్సియా ప‌నిచేసే ఇంటి యజమానే ఉద్దేశపూర్వకంగా మిగ్యుల్ డా సిల్వాను లిఫ్ట్ ఎక్కించి అతని మరణానికి కారణమైందని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘటననకు సంబంధించిన వార్త స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో బ్రెజిల్‌వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.


logo