సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 14:14:01

ట్రంప్ ఓడిపోతే.. అమెరికాపై మ‌ళ్లీ ఉగ్ర‌దాడులే: లాడెన్‌ మేనకోడలు

ట్రంప్ ఓడిపోతే.. అమెరికాపై మ‌ళ్లీ ఉగ్ర‌దాడులే: లాడెన్‌ మేనకోడలు

హైద‌రాబాద్‌: 2001లో, సెప్టెంబ‌ర్ 11వ తేదీన అమెరికాపై జ‌రిగిన ఉగ్ర‌దాడి గుర్తుందా ?  ఆల్‌ఖ‌యిదా ఉగ్ర‌వాదులు డ‌బ్ల్యూటీసీ ట‌వ‌ర్స్‌తో పాటు పెంట‌గాన్‌పై హైజాక్ చేసిన విమానాల‌తో దాడి చేశారు.  ఆ ఉగ్ర సంఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌లిచివేసింది. ఇస్లామిక్ ఉగ్ర‌వాదం ప‌ట్ల అమెరికా అప్ర‌మ‌త్తం కూడా అయ్యింది.  వాస్త‌వానికి ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని అణిచివేస్తాన‌ని చెప్పి.. డోనాల్డ్ ట్రంప్ గ‌త ఎన్నిక‌ల్లో అధ్య‌క పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండ‌వ సారి ఆయ‌న అధ్యక్ష బ‌రిలో ఉన్నారు. ఇక ఈసారి ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోతే ఏం జ‌రుగుతుందో తెలుసా ? ఆ విష‌యాన్ని ఒసామా బిన్ లాడెన్ మేన‌కోడ‌లు అంచ‌నా వేసింది. ఒక‌వేళ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఈ సారి జోసెఫ్ బైడెన్ గెలిస్తే.. అప్పుడు అమెరికాపై 2001 త‌ర‌హాలో ఉగ్ర‌దాడి జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు నూర్ బిన్ లాడిన్ పేర్కొన్న‌ది.  ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఒక‌వేళ డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ గెలిస్తే, అలాంటి ఉగ్ర‌దాడుల‌ను ట్రంప్ ఆప‌గ‌ల‌డ‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేసింది. 

నూర్ బిన్ లాడిన్ వ‌య‌సు 33 ఏళ్లు.  అమెరికాలో వామ‌ప‌క్ష‌వాదులు.. రాడిక‌ల్స్‌తో జ‌త‌క‌ట్టిన‌ట్లు ఆమె ఆరోపించారు. అమెరికా అధ్య‌క్షుడిగా బ‌రాక్ ఒబామా, ఉపాధ్య‌క్షుడిగా బైడెన్ ప‌రిపాలిస్తున్న స‌మ‌యంలో.. ఇస్లామిక్ తీవ్ర‌దానికి చెందిన ఐసిస్ పుంజుకున్న‌ట్లు ఆమె చెప్పింది. దాంతోనే ఆ ఉగ్ర‌వాదులంతా యూరోప్‌లో తిష్ట‌వేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది. డోనాల్డ్ ట్రంప్ త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఆయ‌న పాల‌న‌లో అమెరికా  సుర‌క్షితంగా ఉన్న‌ట్లు నూర్ పేర్కొన్న‌ది. అమెరికాను ర‌క్షిస్తాన‌న్న విష‌యాన్ని ట్రంప్ నిరూపించార‌ని,  ఉగ్ర‌వాదుల్ని స‌మూలంగా నిర్మూలించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆమె తెలిపింది. 2015లో అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ట్రంప్ పేరుగా ప్ర‌క‌టించ‌గానే తాను ఆయ‌నకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్లు నూర్ పేర్కొన్న‌ది. ట్రంప్ ప‌ట్టుద‌ల‌ను చూశాన‌ని, ఆయ‌న్ను మ‌ళ్లీ ఎన్నుకోవాల‌ని, ఇది అమెరికా భ‌విష్య‌త్తుకే కాదు, పాశ్చాత్య నాగ‌రిక‌త‌కు కూడా మంచిదే అన్న అభిప్రాయాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. 




logo