వార్నర్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా విలియమ్సన్ వచ్చినా సన్‌రైజర్స్ హైదరాబాద్ తలరాత మారలేదు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ వీరబాదుడుతో బౌలింగ్‌లో చిత్తయిన ఎస్ఆర్హెచ్.. లక్ష్యఛేదనలోనూ చేతులెత్తేసి ఈ సీజన్లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది. వార్నర్‌కు కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోగా.. హోల్డర్‌ను కాకుండా నబీని తీసుకొని టీమ్ ఎంపికలో రైజర్స్ మేనేజ్మెంట్ మరోసారి విఫలమైంది.
ఢిల్లీ: కెప్టెన్‌గా విలియమ్సన్‌ను నియమించినా ఈ సీజన్లో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన సన్‌రైజర్స్ 55 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 124; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్ (48) కూడా రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్, రషీద్, శంకర్ చెరో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితమైంది. మనీశ్ పాండే (31) టాప్ స్కోరర్ కాగా మిగిలిన వారు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్, మోరిస్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బట్లర్.. బాదుడే బాదుడు
జోస్ బట్లర్ వీరబాదుడుతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. త్వరగా వికెట్లు తీసేందుకు కెప్టెన్ విలియమ్సన్.. మూడో ఓవర్లోనే రషీద్ ఖాన్ (1/24)ను దించగా.. అతడు జైస్వాల్ (12)ను ఔట్‌చేశాడు. అయితే వచ్చీ రాగానే శాంసన్ సిక్సర్ బాదగా.. బట్లర్ సైతం దూకుడుగా ఆడాడు. దీంతో ఆరు ఓవర్లలోనే రాయల్స్ 42 పరుగులు చేసింది. సందీప్ వేసిన 13 ఓవర్లో 17 పరుగులు పిండుకున్న బట్లర్ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకొని ఆ తర్వాత విశ్వరూపం చూపాడు. 150 పరుగులు భాగస్వామ్యం తర్వాత శాంసన్ ఔటైనా ఎస్ఆర్హెచ్ బౌలర్లపై జోస్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 56 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. సందీప్ వేసిన 19వ ఓవర్లో బట్లర్ చివరి బంతికి ఔటయ్యాడు. కాగా ఓ దశలో 30 బంతులకు 32 పరుగుల వద్ద ఉన్న బట్లర్ ఆ తర్వాత మెరుపు వేగంతో శతకాన్ని చేరుకోవడం విశేషం.
ఆసాంతం తడబాటే
భారీ లక్ష్యం ముందుండగా ఏ దశలోనూ హైదరాబాద్ ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్‌గా వచ్చిన పాండే, బెయిర్‌స్టో (30) ఆరంభంలో రాణించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి రైజర్స్ 57 పరుగులు చేసింది. అనంతరం బెయిర్‌స్టో, శంకర్ (8) త్వరగా ఔట్ కాగా.. కాసేపు నిలిచిన విలియమ్సన్ (20) త్యాగి బౌలింగ్‌లో ఔటయ్యాడు. నబీ (17), సమద్ (10), కేదార్ (19) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించేందుకే పరిమితమయ్యాయి.
స్కోరు బోర్డు
రాజస్థాన్: బట్లర్ (బౌల్డ్) సందీప్ 124, యశస్వి (ఎల్బీడబ్ల్యూ) రషీద్ 12, శాంసన్ (సి) సమద్ (బి) శంకర్ 48, పరాగ్ (నాటౌట్) 15, మిల్లర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 14. మొత్తం: 20 ఓవర్లలో 220/3; వికెట్ల పతనం: 1-17, 2-167, 3-209. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-0, సందీప్ శర్మ 4-0-50-1, రషీద్ 4-0-24-1, ఖలీల్ 4-0-41-0, శంకర్ 3-0-42-1, నబీ 1-0-21-0.
హైదరాబాద్: మనీశ్ (బౌల్డ్) ముస్తాఫిజుర్ 31, బెయిర్‌స్టో (సి) అనూజ్ (బి) తెవాటియా 30, విలియమ్సన్ (సి) మోరిస్ (బి) త్యాగి 20, శంకర్ (సి) మిల్లర్ (బి) మోరిస్ 8, కేదార్ (బౌల్డ్) మోరిస్ 19, నబీ (సి) అనూజ్ (బి) ముస్తాఫిజుర్ 17, సమద్ (సి) అనూజ్ (బి) మోరిస్ 10, రషీద్ (సి) మోరిస్ (బి) ముస్తాఫిజుర్ 0, భువనేశ్వర్ (నాటౌట్) 14, సందీప్ శర్మ (నాటౌట్) 8 ; ఎక్స్‌ట్రాలు: 8 , మొత్తం: 20 ఓవర్లలో 165/8. వికెట్ల పతనం: 1-57, 2-70, 3-85, 4-105, 5-127, 6-142, 7-142, 8-143; బౌలింగ్: త్యాగి 4-0-32-1, ముస్తాఫిజుర్ 4-0-20-3, సకారియా 4-0-38-0, మోరిస్ 4-0-29-3, తెవాటియా 4-0-45-1.