సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 17:25:03

చైనాకు వ్యతిరేకంగా.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

చైనాకు వ్యతిరేకంగా.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

సిడ్నీ: చైనా తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయాలు తీసుకున్నది. హాంగ్‌కాంగ్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆ దేశంలో కొత్త భద్రతా చట్టాన్ని చైనా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాన‌మంత్రి స్కాట్ మోరిసన్ చెప్పారు. అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర దేశాలకు వెళ్లే ఉద్దేశమున్న హాంగ్‌కాంగ్ పౌరులు, విద్యార్థులు, వ్యాపారులు, నిఫుణులకు స్వాగతం పలుకుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు వీసా నిబంధనలను సడలించనున్నట్లు తెలిపారు.

తాత్కాలిక వీసాలపై ఆస్ట్రేలియాలో ఉంటున్న హాంగ్‌కాంగ్ విద్యార్థులు, ఉద్యోగులకు ఐదేండ్ల పాటు ఉండే అవకాశం కల్పిస్తున్నామని, అనంతరం శాశ్వత నివాసం కోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చని మోరిసన్ తెలిపారు. భవిష్యత్తులో ఐదేండ్ల పాటు వర్తించే విధంగా విద్యార్థి వీసాలు ఇస్తామన్నారు. మరోవైపు ఆస్ట్రేలియాపై చైనా మండిపడింది. మోరిసన్ ప్రభుత్వం తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ హితవుపలికారు. లేనిపక్షంలో ఆస్ట్రేలియా ఎగుమతులపై ప్రతికూలంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

logo