వాషింగ్టన్: ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నుంచి రూ.12.5 కోట్ల విలువైన పురాతన బుద్ధ విగ్రహం చోరీ అయ్యింది. (Ancient Buddha Statue Stolen) సుమారు 4 అడుగుల పొడవు, 114 కేజీల బరువైన ఈ విగ్రహాన్ని ఒక్కడే ఎత్తుకుపోవడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ సంఘటన జరిగింది. బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ ఆర్ట్ గ్యాలరీలో సెప్టెంబర్ 18న చోరీ జరిగింది. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒక వ్యక్తి ప్రవేశ ద్వారం నుంచి లోపలకు చొరబడ్డాడు. వందల ఏళ్ళ నాటి కాంస్య బుద్ధ విగ్రహాన్ని డాలీ ద్వారా బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక లారీలో దానిని ఎత్తుకుపోయాడు. సుమారు 25 నిమిషాల్లో ఈ దొంగతనం పూర్తి చేశాడు.
కాగా, పురాతన బుద్ధ విగ్రహం చోరీ సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. అయితే సుమారు 114 కేజీల బరువున్న భారీ బుద్ధ విగ్రహాన్ని ఒక్కడే ఒంటరిగా చాలా సునాయసంగా ఎత్తుకెళ్లిన తీరు చూసి లాస్ ఏంజెల్స్ పోలీసులు నోరెళ్లబెట్టారు. సుమారు రూ.12.5 కోట్ల (105 మిలియన్ డాలర్ల) విలువైన కాంస్య బుద్ధ విగ్రహం చోరీపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అరుదైన ఈ కళాఖండం జపాన్ ఎడో కాలానికి (1603-1867) చెందినదని ఆ గ్యాలరీ నిర్వాహకులు తెలిపారు. కాంతిరేఖతో కూర్చున్న బుద్ధుడి విగ్రహం జపాన్‌లోని ప్రముఖ ఆలయం ప్రధాన భాగానికి చెందినదిగా భావిస్తున్నారు.