సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 01:57:07

ప్రాణాలు తీసిన కేకుల పోటీ

ప్రాణాలు తీసిన కేకుల పోటీ
  • గెలువాలన్న తాపత్రయంతో కేకులను ఆబగా తిని మరణించిన వృద్ధురాలు
  • ఆస్ట్రేలియాలో ఘటన

సిడ్ని: పోటీలో నెగ్గాలన్న తాపత్రయంతో కేకులను ఆబగా తిన్న ఓ వృద్ధురాలు చివరకు గుడ్లు తేలేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నది. ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్‌హౌస్‌ హోటల్‌లో కేకు తినే (ఈటింగ్‌ కేక్‌) పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతి పొందిన ల్యామింగ్టన్‌ కేకులను ఈ పోటీలో ప్రత్యేకంగా ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఓ 60 ఏండ్ల మహిళ ల్యామింగ్టన్‌ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్‌ ముక్కలను తిన్న వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను దవాఖానకు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. ఏకబిగిన కేకులను తినటంతో మహిళ మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడిందని వైద్యులు పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల హోటల్‌ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. మహిళ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా ఆ దేశంలో ఏటా తినే పోటీలు నిర్వహిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేకులు తినేవారిని విజేతలుగా ప్రకటిస్తారు.
logo