బుధవారం 03 జూన్ 2020
International - Apr 25, 2020 , 18:05:56

పేదరైతు ఔదార్యం.. న్యూయార్క్ గవర్నర్ కంటతడి

పేదరైతు ఔదార్యం.. న్యూయార్క్ గవర్నర్ కంటతడి

హైదరాబాద్: కరోనా కల్లోలంలో మానవత్వం పరిమళించే కథలెన్నో. ఓ పేద రైతు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమోకు ఓ లేఖ రాశారు. లేఖతోపాటు ఓ ఎన్-95 మాస్కు పంపారు. తన భార్యకు ఓ ఊపిరితిత్తి చెడిపోయిందని, రెండోది కూడా సరిగా పనిచేయదని ఆ రైతు తన లేఖలో తెలిపారు. ఆమె గురించి తాను బెంగ పడుతున్నానని వివరించారు. తాను రైతుగా రిటైరయ్యానని, ప్రస్తుతం ఈశాన్య కాన్సస్‌లో రోజులు వెళ్లదీస్తున్నానని పేర్కొన్నారు. తన దగ్గరున్న ఓ ఎన్-95 మాస్కును లేఖతో పాటు పంపుతున్నానని, దానిని ఎవరైనా డాక్టరు లేదా నర్సుకు అందజేయమని వేడుకున్నారు.

రైతు డెనిస్ రూంకే తన చేతిరాతతో ఆ లేఖరాశారు. దానిమీద ఆయన భార్య షారన్ కూడా సంతకం చేశారు. తన దగ్గర మొత్తం ఐదు మాస్కులు ఉన్నాయని, అందులో ఒకటి పంపుతున్నానని రైతు రూంకే వెల్లడించాడు. గవర్నర్ కూమో శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఆ రైతు లేఖను సాంతం చదివి వినిపించారు. ఇది కదా ధీరత, అంటే.. ఇది కదా దాతృత్వం అంటే.. అంటూ గవర్నర్ కూమో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. మానవత్వం తొంగిచూసే ఘటన ఇది. నిస్వార్థమైన భావన అంటే ఇది అని గవర్నర్ గద్గద స్వరంతో అన్నారు. ఈ ప్రేమ, ఈ ధీరత, ఈ ఔదార్య స్ఫూర్తి ఈ దేశాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దేది ఇవే అంటూ మాస్కు మీడియాకు చూపించారు. ఈ ఘటన తర్వాత మీడియా రూంకేను సంప్రదించింది.

'న్యూయార్క్‌లో పరిస్థితి దారుణంగా ఉందనిపించింది. మాస్కుల కొరత తీవ్రంగా ఉందని తెలిసి కలతపడ్డాను. వెదికితే ఐదు మాస్కులు దొరికాయి. అందులో ఒకటి న్యూయార్క్ గవర్నర్‌కు ఏదో ఉడతా సాయంగా పంపించాను. చివరకు సమాజానికి మేలు చేసేవి ఇవే కదా' అని ఆ పేదరైతు చెప్పారు.logo