బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 15:46:13

కరోనాకు ఎదురొడ్డిన యోధురాలు..

కరోనాకు ఎదురొడ్డిన యోధురాలు..

కరోనా.. ఈ పేరు వినిబడితే ప్రపంచమే గడగడలాడిపోతున్నది. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. అనుమానంతో ఆమడదూరంగా జరుగుతున్న పరిస్థితులు మనం నిత్యం చూస్తున్నాం. ఆ మహమ్మారికి భయపడి బ్లాక్‌లో సైతం మాస్క్‌లు కొంటున్నాం. ఎప్పుడూ లేనిది శానిటైజర్లు కూడా ఎగబడి కొంటున్నాం. మనదగ్గర నమోదైన ఒక్క కేసుకే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇటలీలో వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. వ్యాధిగ్రస్థులకు రోగం నయం చేసేందుకు ప్రతీక్షణాన్నీ ధారపోస్తున్నారు. అందుకు సజీవసాక్ష్యం ఈ ఫొటో.

తెల్లని ముఖం.. కందిపోయిన చెక్కిళ్లు.. ఎరుపెక్కిన మోముతో సెల్ఫీ ఇచ్చిన ఈ యువతి పేరు అలేషియా బొనారీ. కరోనా రోగులకు సేవ చేస్తున్నఈ నర్సు పరిస్థితి ఇది.  ఇటలీలో ప్రస్తుతం కరాళనృత్యం చేస్తున్న కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న నర్సుల్లో అలేషియా కూడా ఉన్నది. కారణం.. వృత్తిపట్ల ఆమెకు ఉన్న కమిట్‌మెంట్ అలాంటిది.  వృత్తినే దైవంగా భావించే అలేషియాలు ఇటలీలో ఎందరో ఉన్నారు.కరోనా బాధితులకు సేవ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె మాటల్లోనే..

‘నేనో నర్సును. ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నా. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని భయం. నేను ధరించిన కళ్లద్దాలు నా కళ్లను సరిగా కవర్ చేయట్లేదేమోనని భయం. గ్లోవ్స్ వెసుకున్న చేతులతో నన్ను నేను అజాగ్రత్తగా తాకి ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డానేమోనని భయం. ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు మంచి నీళ్లు తాగకుండా బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇంతటి ఒత్తిడి కారణంగా నేను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోతున్నా. ఇది నేను మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. నాలాగే ఎంతో మంది తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కానీ నాకు నా వృత్తి అంటే ప్రేమే కాదు గౌరవం కూడా. ప్రశాంతత కోసం నా ఇంటికి వెళ్లేందుకు నాకు ఇష్టం లేదు. అందుకే నేను నిరంతరం రోగులకు సేవ చేస్తా. నా భాధ్యత నిర్వర్తిస్తా. మీరు కూడా మీ బాధ్యతలను నిర్వర్తించండి’ అంటూ ముగించింది అలేషియా. గంటలతరబడి మాస్క్ ధరించడం వల్ల ఆమె మొహం ఎలా ఒరుసుకుపోయిందో ఫొటోలో చూడొచ్చు. అలేషియా పోస్టుకు 8 లక్షలకుపైగా లైకులు, 30వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ‘అలేషియా.. నువ్వు చేస్తున్న సేవ వెలకట్టలేనిది, నీలాంటి వారే నిజమైన దేవతలు. నువ్‌ దేవుని బిడ్డవు.. థ్యాంక్స్‌ అలేషియా’ అంటూ వేలాదిగా నెటిజన్లు తమ మద్దతు తెలుపుతున్నారు.


logo