గురువారం 04 జూన్ 2020
International - Apr 05, 2020 , 13:05:57

ప్రయోగశాలలో ఆ మందు కరోనా వైరస్‌ను చంపేసింది

ప్రయోగశాలలో ఆ మందు కరోనా వైరస్‌ను చంపేసింది

హైదరాబాద్: కరోనాపై పోరులో శాస్త్రపరిశోధనా రంగం ఒక ముందంజ సాధించింది. మానవ దేహంలో పరాన్నజీవులను హతమార్చేందుకు ఉద్దేశించిన ఐవర్‌మెక్టిన్ అనే మందు ప్రయోగశాలలో కరోనా వైరస్ లేదాసార్స్-కోవ్-2ను నిర్వీర్యం చేసింది. 48 గంటల్లో వైరస్ వీగిపోయిందని యాంటీవైరల్ రిసెర్చ్ జర్నల్‌ తాజా సంచికలో ఆస్ట్రేలియాలో జరిపిన ఈ పరిశోధనపై  ప్రచురించిన ఓ అధ్యయన నివేదిక ద్వారా తెలిసింది. పరీక్ష నాళికలో వైరస్ ఎదగకుండా ఆ మందు అడ్డుకుందని అందులో వివరించారు. ఒకేఒక్క డోసుతో  24 గంటల్లో వైరస్ గణనీయంగా తగ్గిపోయిందని, 48 గంటల్లో పూర్తిగా అంతరించిందని నివేదిక సహ రచయిత, ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన కైలీ వ్యాగ్‌స్టాఫ్ పేర్కొన్నారు. హెచ్ఐవీ, డెంగీ, ఇన్‌ఫ్లూయంజా, జికా వంటి వైరస్‌లపై ఐవర్‌మెక్టిన్ బాగా పనిచేస్తుందని, సురక్షితమైందని పేరున్నది. అయితే తాము పరీక్షలు జరిపింది పరీక్ష నాళికలోనేనని, మనుషులపై ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉందని కైలీ చెప్పారు. ఈ మందు కరోనాపై ఎలా పనిచేస్తుందనేది చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ప్రీ-క్లినికల్, క్లినికల్ ట్రయల్స్ తర్వాతే ఏదైనా నిర్ధారణ అవుతుంది.


logo