శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 20:52:30

ఫ్లూ టీకాతో కొవిడ్‌ ప్రమాదాన్ని తగ్గించొచ్చా?

ఫ్లూ టీకాతో కొవిడ్‌ ప్రమాదాన్ని తగ్గించొచ్చా?

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పదిలక్షల మార్కుకు చేరువైంది. అలాగే, ప్రతిరోజూ కేసుల సంఖ్య మనల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మహమ్మారితో పోరాడే సురక్షితమైన, చౌకైన వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా, టీకా వచ్చేంతలోపు ఈ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నిపుణులు ప్రస్తుతమున్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే  క్షయవ్యాధి లేదా ఫ్లూ లాంటి వాటిని ఎదుర్కొనేందుకు తీసుకునే టీకాలు కొవిడ్‌ నుంచి  ఉత్పన్నమయ్యే సమస్యల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయని పేర్కొంటున్నారు.

ఇది వాస్తవమేనా..? 

ఫ్లూ టీకా అనేది కొవిడ్‌-19 ను ఎదుర్కొంటుందని ఖచ్చితంగా ఎక్కడా నిరూపించబడలేదు. కానీ, ఈ టీకాలు కూడా వైరస్‌నుంచి కాపాడుకునేలా మన శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసేందుకే తయారుచేసినందున, కొవిడ్‌ నుంచి కూడా కొంత రక్షణ కల్పిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే యూఎస్‌లో ఫ్లూ సీజన్‌కుముందు ఫ్లూ టీకాలు వేయించుకోవాలని ప్రజలకు సిఫారసు చేశారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు వ్యాధులపై పోరాడడానికి సహాయపడుతుందని వారు చెబుతున్నారు. ‘శరీరానికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రోగనిరోధక ప్రతిస్పందన ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. తర్వాత వ్యాధికారక కణంపై తక్షణమే దాడి చేస్తుంది. అవి శరీరంలోని ఎక్కువ కణాలకు సోకకుండా అడ్డుకుంటుంది.’ అని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇది ప్రధాన కారణం..

అలాగే, ఒక వ్యాధి శరీరాన్ని బలహీనపరుస్తుంది, ముఖ్యంగా ఫ్లూ. ఇది కొవిడ్‌-19 మాదిరిగానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీరు ఇప్పటికే ఒక వ్యాధి వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ శరీరం బలహీనంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బిజీగా ఉంటుంది. ఫ్లూను నివారించడం ద్వారా మీరు మీ శరీరాన్ని కొవిడ్‌-19 వ్యాధితో పోరాడటానికి సిద్ధంగా ఉంచవచ్చు అని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఫ్లూ టీకా తీసుకోవాలని తాము సూచించేందుకు ఇది ఒక రీజన్‌ అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మూడు అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకున్న చాలామంది ప్రజలు కొవిడ్‌తో తక్కువగా చనిపోయారని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.