శనివారం 06 జూన్ 2020
International - Apr 10, 2020 , 13:42:36

కళ్లెదుటే ఉన్నా గుండెకు హత్తుకోలేకపోయాడు

కళ్లెదుటే ఉన్నా గుండెకు హత్తుకోలేకపోయాడు

కొవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. దీంతో చాలామంది వారి మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను కోల్పోతున్నారు. ఉదాహరణకు అమెరికాలోని మిచిగాన్‌లో ఒక వ్యక్తి మ‌న‌వ‌రాలిని చూడాల‌ని ఆకాంక్షతో ఆరు కిలోమీటర్లు ఆగ‌మేఘాల‌మీద వ‌చ్చి ఇంటి ముందు వాలిపోయాడు. ఎప్పుడెప్పుడు మ‌న‌వ‌రాలిని చూస్తానా అని మ‌న‌సులో ఒక‌టే అల‌జ‌డి. తీరా ఇంటికి వ‌చ్చాక, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించ‌లేదు. ఇంటి బ‌య‌ట కిటికీ నుంచి పాప‌ను క‌ల్లార చూసి సంతోషించాడు.

క‌ళ్ల‌ముందే ఉన్న మ‌న‌వ‌రాలు ఎలియానాను గుండెకు హ‌త్తుకోలేక‌పోతున్నాడ‌న్న బాధ‌ను అంద‌రినీ క‌లిచివేసింది. తాత‌ స్ప‌ర్శ మనవరాలికి తాక‌లేద‌ని పాప తండ్రి ఆవేద‌న‌ పడటం, పండుగ‌లా జ‌రుపుకోవాల్సిన వేడుక‌ను ఇలా కిటికీ వ‌ద్ద నుంచి చూసి మురిసిపోవాల్సి వ‌స్తుంద‌ని త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోవడం వంటివి అందరి హృదయాలను బరువెక్కించాయి. ఇంటి వ‌ర‌కు వ‌చ్చి లోప‌లికి వెళ్లి మ‌న‌వ‌రాలిని ఎత్తుకోవ‌చ్చు. కానీ అలా చేయ‌లేదు. ఈ మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఉండాలి, సామాజిక దూరాన్ని ఆచరించాలన్న‌ ఉద్దేశంతోనే ఈ సంఘ‌ట‌న‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు తండ్రి జోషువా గిల్లెట్‌. అంద‌రు దీన్నిపాటిస్తే వీలైనంత త్వ‌ర‌గా క‌రోనా వైర‌స్‌ను త‌రిమికొట్ట‌చ్చు అంటున్నారు గిల్లెట్‌. మిచిగాన్‌లో క‌రోనా  కేసుల సంఖ్య 18,970 కు పెరిగింది. అక్క‌డ‌ 845 కరోనావైరస్ మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు.


logo