మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 15:13:42

‘మానసిక కుంగుబాటు’ను నయం చేసే మందొచ్చేసింది!

‘మానసిక కుంగుబాటు’ను నయం చేసే మందొచ్చేసింది!

వాషింగ్టన్‌: డిప్రెషన్‌.. మానసిక కుంగుబాటు.. ఇప్పుడు యువతతోపాటు అందరినీ వేధిస్తున్న సమస్య. ఇటీవల బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఇది మరింత చర్చనీయాంశమైంది. కరోనా నేపథ్యంలోనూ ఇంటికే పరిమితమైన కొంత మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. యూఎస్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పలు పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. దీని బారినపడ్డవారు కోలుకోవడం చాలా కష్టం. మంచి సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే తప్ప డిప్రెషన్‌ నుంచి బయటపడలేం. అయితే, ఇలాంటి వారికి ప్రసిద్ధ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌(జేఅండ్‌ జే) కంపెనీ శుభవార్త అందించింది. డిప్రెషన్‌ నుంచి కోలుకునేలా పనిచేసే మొట్టమొదటి యాంటీడిప్రెసెంట్‌ నాసల్‌ స్ప్రేను రూపొందించింది. దీనిని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.

ఈ నాసల్‌ స్ప్రేకు ‘స్ప్రేవాటో’ అని పేరుపెట్టారు. ఇది ప్రస్తుతం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదం పొందిందని, త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతామని జేఅండ్‌జే యూఎస్ న్యూరోసైన్స్ మెడికల్ ఎఫైర్స్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ క్రామెర్ పేర్కొన్నారు. స్ప్రావాటోకు 2019 మార్చిలో అనుమతి లభించినప్పటినుంచీ సుమారు 6,000 మందిపై ప్రయోగించామని చెప్పారు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనే ధోరణితో ఉన్నవారిలో కూడా మార్పు తీసుకువచ్చిందన్నారు. ఇది సెరాటోనిన్ లేదా నోరెఫినెఫ్రైన్‌ మీద కాకుండా మెదడులోని గ్లూటామేట్ వ్యవస్థపై పనిచేస్తుందని వివరించారు. కాగా, దీనిని పరిమితంగానే వాడాలని వెటరన్స్‌ అఫైర్స్‌ మెడికల్‌ ప్యానెల్‌ సూచించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo