బుధవారం 03 జూన్ 2020
International - Apr 09, 2020 , 01:23:01

అమెరిగన్స్‌!

అమెరిగన్స్‌!

 • కరోనా విలయతాండవంతో ఆత్మరక్షణలో అమెరికన్లు
 • ఒక్క మార్చి నెలలోనే 20 లక్షల తుపాకుల కొనుగోలు
 • ఇప్పటికే ప్రతి వంద మందికి 120.5 తుపాకులు

‘ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులు... ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు... కృషి-ఖుషీ సంగమించే చోట...’ అంటూ అమెరికాను సృష్టికే ప్రతి సృష్టిగా అభివర్ణించాడు.. సినీ గేయ రచయిత ఆత్రేయ. నిజమే.. ఇతర దేశాల్లోని అందునా అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి దేశాల్లోని సగటు జీవికి అగ్రరాజ్యమంటే ఓ స్వర్గధామం. మరి అలాంటి ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’ తలరాత ఇప్పుడు తారుమారైంది. రేపు అనేది ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన ఆ దేశ పౌరుల్ని పట్టి పీడిస్తున్నది. అందుకే మనుగడ కోసం పోరాటం.. అంటూ లక్షలాది మంది పౌరులు రికార్డు స్థాయిలో తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే దాదాపు 20 లక్షల తుపాకుల విక్రయం జరిగింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) లెక్కల ప్రకారం.. గత మార్చి నెలలో అమెరికన్లు ఏకంగా 20 లక్షల తుపాకులను కొనుగోలు చేయడం ఆ దేశ యంత్రాంగాన్ని కలవరపరుస్తున్నది. 2013 జనవరిలో బరాక్‌ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక, శాండీహుక్‌ మారణహోమం తర్వాత ఆ స్థాయిలో తుపాకుల కొనుగోళ్లు జరుగుడం ఇదే తొలిసారి. కరోనా మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో స్వీయ రక్షణ కోసం ప్రజలు తుపాకుల కోసం ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తుపాకుల దుకాణాల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. 


తనిఖీలు ముమ్మరం..

తుపాకీ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎఫ్‌బీఐ తనిఖీలను (బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌) ముమ్మరం చేసింది. ఒక్క మార్చి నెలలోనే 37 లక్షల తనిఖీలు నిర్వహించింది. 1998లో తనిఖీల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే గతేడాది మార్చితో పోలిస్తే ఇది 11 లక్షలు ఎక్కువ. ఒక్క మార్చి 21వ తేదీనే 2.10 లక్షల తనిఖీలు నిర్వహించడం కూడా రికార్డే. 2015లో  కాలిఫోర్నియాలోని శాన్‌ బెర్నార్డియోలో జరిగిన సామూహిక కాల్పుల నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం ఆ ఏడాది డిసెంబరులో తుపాకులపై ఆంక్షలు పెట్టాలని యోచించింది. ఈ నేపథ్యంలో అప్పుడు భారీఎత్తున ఒక్క డిసెంబరు నెలలోనే 3.3 మిలియన్ల (33 లక్షలు) మేర తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత దానికంటే అధిక స్థాయిలో తాజాగా మార్చిలో తనిఖీలు నిర్వహించారంటే తుపాకుల కొనుగోళ్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇది సామాజిక రుగ్మత..

పౌరులు ఇలా ఎగబడి తుపాకులు కొనుగోలు చేయడం కేవలం భయం మాత్రమే కాదు... సామాజిక రుగ్మతగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. రెండు అంశాల ఆధారంగా తుపాకుల కొనుగోళ్లు పెరిగాయని యూఎస్‌ గన్‌ ఇండస్ట్రీ నిపుణుడు, జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ లా స్కూల్‌ ప్రొఫెసర్‌ టిమోతీ లిట్టన్‌ విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుత కరోనా దరిమిలా శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి. దీంతో సొంతంగా మనుగడ సాధించేందుకు తుపాకీ ఒక్కటే అవసరపడుతుందనే భావనగా ఉండొచ్చు. రెండోది.. అమెరికా ప్రభుత్వం అమెరికన్ల స్వేచ్ఛను హరించే సమయంలో తుపాకీ ఒక్కటే శరణ్యం’ అని భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా అమెరికా రాజ్యాంగంలోనూ ఈ మేరకు వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం ఆంక్షల పేరిట నిరంకుశంగా వ్యవహరించే అవకాశమున్నందున చాలామంది తుపాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, తుపాకీ ఇండస్ట్రీ లాబీయింగ్‌ నేపథ్యంలో ఫార్మసీ, గ్యాస్‌, గ్రాసరీలతోపాటు తుపాకీ స్టోర్లను కూడా అత్యవసర వాణిజ్యం కింద ప్రభుత్వం ప్రకటించింది.

స్మాల్‌ ఆర్మ్స్‌ సర్వే ప్రకారం...

 • అమెరికాలో పౌరుల వద్ద ఉన్న తుపాకులు 40 కోట్లు 
 • ప్రపంచంలోని మొత్తం తుపాకుల సంఖ్యలో ఇది 46%
 • సగటున ఒక్కో అమెరికన్‌ పౌరుడి వద్ద ఉన్న తుపాకులు 1.3
 • అమెరికా జనాభాలో 30 శాతం మంది వద్ద మాత్రమే తుపాకులు ఉన్నాయి. ఈ లెక్కన 10 కోట్ల మంది వద్ద 40 కోట్ల తుపాకులున్నట్టు. 
 • అమెరికాలో తుపాకీ కనీస ప్రారంభ ధర 200 డాలర్లు 
 • గన్‌ రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ వంటి ఫీజులు.. 800-900 డాలర్లు 
 • అమెరికా సైన్యం  దగ్గర ఉన్న తుపాకుల కన్నా.. పౌరుల దగ్గర వందరెట్లు ఎక్కువ ఉన్నాయి. 
 • రష్యా, చైనా, భారత్‌, అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం, ఇరాన్‌, పాకిస్థాన్‌ సైన్యాల వద్ద ఉన్న మొత్తం తుపాకులకన్నా మూడు రెట్లు ఎక్కువగా అమెరికా పౌరుల వద్ద ఉన్నాయి.logo