శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 16:48:08

గల్వాన్‌లో 60 మంది చైనా సైనికుల మృతి : వెల్లడించిన అమెరికా పత్రిక

గల్వాన్‌లో 60 మంది చైనా సైనికుల మృతి : వెల్లడించిన అమెరికా పత్రిక

వాషింగ్టన్‌ : గల్వాన్‌ లోయలో జూన్‌ 15 న భారత్‌-చైనా మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 60 మంది చనిపోయారు. అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ తన సెప్టెంబర్‌ 11 నాటి సంచికలో ఈ సంచలన విషయాలను ప్రచురించింది. పీఎల్‌ఏ తోకముడుస్తుందని చైనా ఏనాడూ భావించలేదని, దుందుడుకుగా వ్యవహరించే జిన్‌పింగ్‌కు ఇది పెద్ద అపజయంగా భావించాలని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

న్యూస్‌ వీక్‌ పత్రిక కథనం ప్రకారం.. భారత సరిహద్దులో చైనా సైన్యం విఫలమైంది. ఈ వైఫల్యం తరువాత సైన్యంలో విధేయులను నియమించుకోవాలని చైనా సైన్యం జిన్‌పింగ్‌కు సూచించింది. అతి పెద్ద విషయం ఏమిటంటే, వైఫల్యం కారణంగా పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్, పిఎల్‌ఏ నాయకుడు కూడా అయిన జిన్‌పింగ్.. భారత సైనికులపై వీలైనంత త్వరగా మరో దూకుడు చర్య తీసుకోవాలని ప్రోత్సహించారు. ఈ కథనంలో చైనాకు చెందిన ఎంత మంది సైనికులు చనిపోయింది వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి తప్పిదమే అని తెలిపింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించింది. చైనా పీఎల్‌ఏ ఎందుకు వెల్లడించలేదు అని ప్రశ్నించింది. ఆనాటి ఘర్షణలో చైనాకు చెందిన దాదాపు 60 మంది మరణించారని కథనంలో వెల్లడించారు. మరెందరో గాయపడ్డారని కూడా కథనం తెలిపింది.

జిన్‌పింగ్ రాకతో పెరిగిన పీఎల్ఏ చొరబాట్లు

వాస్తవానికి, మే నెల ప్రారంభంలో చైనా దళాలు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) కి దక్షిణంగా ముందుకు సాగాయి. లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య మూడు వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక సరిహద్దు ఉంది. చైనా సైన్యం భారత సరిహద్దులోకి ప్రవేశిస్తూనే ఉన్నది. 2012 లో జిన్‌పింగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు మరింత ఎక్కువయ్యాయి. గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏండ్ల తరువాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణ. ఆగస్టు నెల చివరలో 50 సంవత్సరాలలో మొదటిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించింది. చైనా స్వాధీనం చేసుకున్న అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలను భారతదేశం తిరిగి తన వశం చేసుకుంది. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా సైన్యం షాక్‌కు గురైంది. ఆశ్చర్యపోయిన చైనా సైనికులు వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. చొరబాటుదారులకు భారత్‌ అవకాశం ఇవ్వడం లేదని న్యూస్‌ వీక్‌ తన కథనంలో స్పష్టంచేసింది. 


logo