శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 01:51:36

విదేశాల్లోనూ సీఏఏ సెగ

విదేశాల్లోనూ సీఏఏ సెగ
  • అమెరికాలోని 30 రాష్ర్టాల్లో ప్రవాస భారతీయుల ఆందోళన
  • సీఏఏ విభజనకారి: ఈపీపీ
  • అమెరికాలోని 30 రాష్ర్టాల్లో ప్రవాస భారతీయుల ఆందోళన

న్యూఢిల్లీ/కోల్‌కతా/వాషింగ్టన్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు విదేశాలకూ పాకాయి. ఆదివారం అమెరికాలోని 30 రాష్ర్టాల్లో సీఏఏ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, ఈక్వాలిటీ ల్యాబ్స్‌, హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ తదితర సంస్థలు ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహించాయి. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, షికాగో, హ్యూస్టన్‌,  శాన్‌ ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో నివసిస్తున్న వందల మంది ప్రవాస భారతీయులు 71వ గణతంత్ర దిన వేడుకలను తమ నిరసనకు వేదికగా చేసుకున్నారు. బ్యాన్లరు, ప్లకార్డులు పట్టుకొని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన ప్రదర్శనలో రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే పాల్గొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలే కాపాడుకుంటారనే నమ్మకం ఈ ఉద్యమంతో తనకు కలిగిందని చెప్పారు. మరోవైపు ఈయూ పార్లమెంట్‌లో సీఏఏపై బుధవారం చర్చ, గురువారం ఓటింగ్‌ జరుగనున్నది. పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీ అయిన ‘యురోపియన్‌ పీపుల్స్‌ పార్టీ’(ఈపీపీ).. సీఏఏతో భారీగా ప్రజలు నిలువనీడను కోల్పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. 


బయటివాళ్ల ప్రమేయం అవసరంలేదు: వెంకయ్య 

సీఏఏ పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఈ అంశంలో విదేశీ సంస్థలు, ప్రభుత్వాల జోక్యం అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సీఏఏపై ఈయూ పార్లమెంట్‌ చర్చించనుండటంపై ఆయన సోమవారం స్పందిస్తూ.. ఇలాంటి ప్రకటనలు, చర్చలు అవాంఛనీయమన్నారు. మరోవైపు ఒక దేశ చట్టాలపై మరో దేశం తీర్మానం చేయడం సమంజ సం కాదని  స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ మేరకు ఈయూ పార్లమెంట్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మరియా సస్సోలికి లేఖ రాశారు. కాగా.. పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులపై జరుగుతున్న వేధింపులపై కూడా ఈయూ పార్లమెంట్‌ స్పందించాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు కేంద్రం సీఏఏను అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మార్చిందని కాంగ్రెస్‌ విమర్శించింది.


సీఏఏను అమలు చేయం 

సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ సోమవారం తీర్మానించింది. దీనికి టీఎంసీతోపాటు కాంగ్రెస్‌, సీపీఎం కూడా మద్దతు పలికాయి. తద్వారా సీఏఏపై తీర్మానం చేసిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు యూపీలో సీఏఏ నిరసనకారులను పోలీసులు వేధిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక తదితరులు సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 



logo