శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 20:03:29

నిర్లక్ష్యమే అమెరికా కొంప ముంచింది

నిర్లక్ష్యమే అమెరికా కొంప ముంచింది

ప్రపంచాన్ని సామాజికంగా, ఆర్థికంగా కుదిపేస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కండ్లు అమెరికా మీదనే ఉన్నాయి. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది- ప్రపంచంలోనే అన్ని రంగాల్లో ఎదురులేని శక్తిగా, అగ్రరాజ్యంగా అమెరికా పేరుగాంచింది. అలాంటి అమెరికా కరోనా వైరస్‌తో మిగతా అన్ని దేశాలకన్నా ఎక్కువగా విలవిలలాడతున్నది. వైరస్‌ ప్రభావంతో ఏ దేశంలో లేని స్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నది. అతి ఎక్కువ స్థాయిలో వైరస్‌ బారిన పడుతున్నారు. అంత శక్తివంతమైన దేశం వైరస్‌ తాకిడికి ఇలా అతలాకుతలం ఎందుకవుతున్నదో అందరినీ ఆలోచింప చేస్తున్నది, ఆందోళనకు గురిచేస్తున్నది. రెండవది- తెలుగు వారు ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అమెరికాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కారణం రిత్యా కూడా అమెరికా సమస్య మరో అర్థంలో మన తెలుగువారి సమస్య, తెలంగాణ సమస్య అయ్యింది.  అందుకే  కరోనా నేపథ్యంలో అమెరికా, అమెరికాలోని తెలుగు వారి పరిస్థితిని చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం.

చాలా మంది ఊహిస్తున్నట్లు, లేదా భయపడుతున్నట్లు అమెరికా ఏమీ కుప్పకూ లిపోదనేది నా భావన. పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే ఉద్యోగ కల్పన, సామాజిక జీవనంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిరుద్యోగం పెరుగు తుంది, ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. కానీ ఇదేమీ ఆర్థిక సంక్షోభం కాదు కాబట్టి  అలాంటి ప్రమాదమేమీ ఉండదని అనుకుంటున్నాను. కరోనా ఫలితంగా కేవలం ఆర్థిక వ్యవహరాలు నిలిచిపోయాయి. ఉత్పాదక, వాణిజ్య,ఆర్థిక రంగంలో అనివార్యమైన ప్రతిష్ఠంబన ఏర్పడింది. కరోనా మహమ్మారి అంతమైన తర్వాత ఒకటి రెండు నెలల్లో తిరిగి అమెరికా యధావిధిగా ఆర్థిక గమనంలో పయణిస్తుందని అనుకుంటున్నా.

కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతున్నది వాస్తవమే. చరిత్రలో అమెరికా సమాజం మునుపెన్నడూ లేని స్థాయిలో అర్థిక, ప్రాణ నష్టాలకు గురవుతున్నది. వాషింగ్టన్‌లో మార్చి మొదటి వారంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూసింది. అయితే కరోనా వైరస్‌ ప్రమాదాన్ని, దాని విస్తరణ ప్రభావాన్ని అంచనా వేయటంలో నిర్లక్ష్యం వహించారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా చాలా రాష్ర్టాలు ముందు జాగ్రత్త చర్యగా ఏ చర్యలు తీసుకోలేదు. లాక్‌డౌన్‌లు ప్రకటించలేదు. ఓ దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినా కొన్ని రాష్ర్టాలు పాటించిన దాఖలాలు లేవు. దీనికి ఈ సమాజంలో ఉన్న స్వేచ్ఛా తత్తమే ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చు. ఏదేమై నా ఇప్పడు అమెరికా పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు, బలి అవుతున్నారు. వాషింగ్టన్‌లో 10శాతం, న్యూ యార్క్‌లో 25శాతం జనాభా కరోనా వైరస్‌ బారిన పడ్డారంటే వైరస్‌ విజృంభణను ఊహించుకోవచ్చు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే తప్ప మరేమీ కాదు. ఇక్కడనే ఒక విషయం చెప్పాలనిపిస్తున్నది. కరోనా విషయంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు గొప్పవి. పెద్ద ఉపద్రవం నుంచి తెలంగాణ సమాజాన్ని కాపాడటంలో సీఎం కేసీఆర్‌ కృషి ఎనలేనది. 

ఇక్కడ ప్రత్యేకంగా భారతీయుల పరిస్థితి గురించి చెప్పుకోవాలి. అమెరికాలో స్కిల్డ్‌ లేబర్‌గా, అదర్‌ స్కిల్డ్‌ లేబర్‌గా భారతీయులు అనేక రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే కోటి 60లక్షల మంది నిరుద్యోగులుగా మారారని చెబుతున్నారు. జూన్‌ చివరి నాటికీ, ఆ తర్వాత పరిస్థితుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే పరిస్థితి అయితే ఉంటుందనటంలో సందేహం లేదు. ఇందులో భారతీయులు, తెలుగువారు కూడా ఉంటారు. మొత్తం మీద చాలా కాలంగా ఆశల సౌధంగా ఉన్న అమెరికా ఇప్పుడు తానే పెద్ద సామాజిక సంక్షోభంలో కూరుకుపోవటం ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. అయితే హెచ్‌1బీ వీసాదారులు, ఇతరత్రా ఉద్యోగస్తులు భవిష్యత్తు అంతా అంధకారమైనట్లు భావించాల్సిన అవసరం లేదు. 

కరోనా ప్రభావం నుంచి అమెరికా ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితి ఏమీ కనిపించటం లేదు. ఎంత కాదన్నా కనీసంగా జూన్‌ రెండో వారం నాటికి కానీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నది. అప్పుడు మాత్రమే నిర్ధిష్టంగా ఆయా రంగాలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేయగలం. ముందే ఊహించుకుని ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా నాకు అందిన సమాచారం ప్రకారం అమెరికాలోని భారతీయులు 1500 మంది దాకా కరోనా బారిన పడ్డారు. 40మంది చనిపోయినట్లు సమాచారమున్నది. ఈ సంఖ్య ఇంకా పెరిగవచ్చన్న భయాలున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రవాస భారతీయులను ఆదుకునేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు కృషిచేస్తున్నాయి, మునుముందుకూడా కొనసాగిస్తాయి. 

వరంగల్‌ నుంచి వాషింగ్టన్‌కు నా పయనం సాధారణమైనది కాదు. ఎన్నో కలలు, అంతకు మించిన అందమైన ఆశాసౌధాలు దాని వెనుక ఉన్నాయి. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అమెరికా వైపు సాహసంతో మాత్రమే చూడలేదు. అని చెప్పి, ఏదో ఉద్యోగవేటలో భాగంగా మాత్రమే తెలంగాణ నుంచి అంత దూరం ప్రయాణం సాగించలేదు. 90వ దశకంలో మా తరానికి అమెరికా ఓ కలల ప్రపంచం. అప్పటికి నాకు, నాబోటి వారికి, అమెరికా అంటే.. అది ఓ ‘ల్యాండ్‌ ఆఫ్‌ అపార్చునిటీస్‌'. అదొక స్వేచ్ఛా ప్రపంచం. ఉన్న ఊరును, కన్న వారిని విడిచి గ్లోబుకు ఈ చివర ఉన్న భారత్‌నుంచి ఆ చివర ఉన్న అమెరికా ప్రయాణం వెనుక ఓ స్పష్టమైన లక్ష్యం, భవిష్యత్తుపై గొప్ప ఆశ, అంతకు మించి భరోసాతోనే 2006లో అక్కడ కాలు పెట్టాను.

ఊహించినట్లుగానే అమెరికా మా తరాన్ని అక్కున చేర్చుకున్నది. నైపుణ్యానికి పెద్దపీట వేసే అమెరికాలో సహజంగానే భారతీయులకు అత్యున్నత స్థానాలు దక్కాయి. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లే కాదు, ఎంతో మంది తెలగువారు  అమెరికాలో తమ నైపుణ్యాలతో రాణిస్తున్నారు. నేను కూడా సంతృప్తికరమైన స్థితిలోనే ఉన్నాను. అయితే శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, కొత్త ఆవిష్కరణలతో ఆ మధ్య కాలంలో సాఫ్ట్‌ వేర్‌ రంగం పెద్ద కుదుపుకు లోనైంది. అప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని అందరూ భయపడ్డారు. కానీ అనతి కాలంలోనే దాన్ని అధిగమించటం జరిగింది.  ఇప్పుడు కూడా కరోనా ప్రభావంతో అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలో, మనకూ కొంత ఎదురవక మానదు. అందుకు మానసికంగా సిద్ధంగా ఉంటూనే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అమెరికా అంటేనే అవకాశాల నేల. గతంలో లాగానే ప్రస్తుతం కూడా మనం నిలువాలి. ఆందోళనతో నిర్వీర్యం కానవసరం లేదు. ఎదురవుతున్న సవాల్లలోంచే గెలుపు బాటలో నడువాలి.  నేను చేయి తిరిగిన రచయితను కాదు. కాబట్టి నాదైన జీవితం, అనుభవం నుంచి  అమెరికా పరిణామాలను అర్థం చేసుకున్నదానికి ప్రతిఫలనం ఇది.


logo